AP Cabinet meeting on CPS: అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోగా సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన జగన్... ఉద్యోగులను దగా చేశారు. పాత పింఛను పథకాన్ని పునరుద్ధరిస్తారని ఎదురుచూసిన ఉద్యోగులను నిలువునా మోసం చేశారు. ఓపీఎస్ పునరుద్ధరించలేమని తేల్చిచెప్పేశారు. సీపీఎస్ స్థానంలో గ్యారంటీ పింఛను పథకం అమలుకు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఏళ్ల తరబడి ఉద్యోగులు ఎదురుచూస్తున్న పాత పింఛను పథకం దక్కదని తేల్చేశారు. మంత్రిమండలి నిర్ణయంపై సీపీఎస్ వ్యతిరేక ఉద్యోగ సంఘాలు భగ్గుమంటున్నాయి.
ఇదీ సీపీఎస్ రద్దుపై ప్రతిపక్ష నేతగా జగన్ ఇచ్చిన హామీ. వారంలో సీపీఎస్ రద్దు చేస్తానని మాటిచ్చిన ఆయన... ఇప్పుడు మాట తప్పారు. మడమ తిప్పేశారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చాలా రోజుల కిందటే... ఉద్యోగులకు ఈ చావుకబురు చల్లగా చెప్పేశారు. సీపీఎస్ రద్దుపై ప్రతిపక్షంలో ఉండగా హామీ ఇచ్చినా... టెక్నికల్ సబ్జెక్టు తమకూ తెలియదన్నారు. ఓపీఎస్ కు వెళ్లడం అసాధ్యమని, ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నామని గతంలోనే సెలవిచ్చారు.
OPS Demand: ఉద్యోగులు కోరుకునేది జీపీఎస్ కాదు.. ఓపీఎస్: ఉద్యోగ సంఘాలు
సీపీఎస్ రద్దు సాధ్యం కాదని, ప్రత్యామ్నాయం చూస్తున్నామని సజ్జల చెప్పినట్లే... జీపీఎస్ తీసుకొస్తున్నట్లు ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించింది. బుధవారం నిర్వహించిన మంత్రిమండలి సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయాలను సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విలేకర్లకు వివరించారు. దాంతో పాటు మంత్రిమండలి సమావేశంలో సీపీఎస్, ఓపీఎస్, జీపీఎస్ పై ఏం చర్చ జరిగిందో ప్రభుత్వం అధికారికంగా వివరాలు వెల్లడించింది.
సీపీఎస్ రద్దు చేస్తూ సంతకం పెట్టాలంటే నిమిషంలో చేయవచ్చని... కానీ పాత పింఛను విధానాన్ని అమల్లోకి తీసుకురావాలంటే భవిష్యత్తు తరాలపై మోయలేని భారం పడుతుందని పేర్కొంది. O.P.S. అమలు చేస్తే 2041 నాటికి పింఛన్ల భారం బడ్జెట్‌లో 65 వేల 234 కోట్లకు, 2070 నాటికి 3 లక్షల 73 వేల కోట్లకు పెరుగుతాయని తెలిపింది. ఆ భారాన్ని తట్టుకోలేక ఏదో ఒక దశలో మళ్లీ ఓపీఎస్ రద్దు చేసే పరిస్థితి వస్తుందన్న ప్రభుత్వం... అందుకే ఓపీఎస్ అమలు చేయలేమని తేల్చిచెప్పింది.సీపీఎస్ స్థానంలో జీపీఎస్ తీసుకొస్తున్నామని వెల్లడించింది.