AP GOVT advisor Sajjala Ramakrishna Reddy comments: ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 13వ తేదీన జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లన్నీ టీడీపీ కావని.. ఆ ఓట్లన్నీ పీడీఎఫ్, ఇతర వామపక్షాలకు చెందిన ఓట్లే.. టీడీపీ వైపు మళ్లాయన్నారు. టీడీపీ సంబరాలు చేసుకోవటంతోనే అంతా అయిపోలేదని, ఈ ఫలితాలను తాము హెచ్చరికగా భావించటంలేదని సజ్జల వ్యాఖ్యానించారు.
ఈ ఎన్నికలతో ఏదో మారిపోయిందని అనుకోవద్దు:''పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లన్నీ టీడీపీవి కావు. అవన్నీ పీడీఎఫ్, ఇతర వామపక్షాలకు చెందిన ఓట్లు. ఆ ఓట్లే టీడీపీ వైపు మళ్లాయి. ఓట్ల బండిల్‌లో ఏదో గందరగోళం జరిగింది. కౌంటింగ్‌లో జరిగిన అవకతవకలపై ఈసీకి ఫిర్యాదు చేశాం. ఎమ్మెల్సీ ఎన్నికలతో ఏదో మారిపోయిందని అనుకోవద్దు. ఈ ఎన్నికల్లో టీడీపీ బలం పెరిగిందనడం హాస్యాస్పదంగా ఉంది. ఈ ఫలితాలు ఏ రకంగానూ మా ప్రభుత్వంపై ప్రభావం చూపబోవు. ఈ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనం అని భావించలేము. ఇక్కడ ఓట్లు వేసింది సమాజంలోని ఓ చిన్న భాగం మాత్రమే. తొలిసారి టీచర్ ఎమ్మెల్సీలు గెలవడం మాకు పెద్ద విజయం. మా ఓటర్లు వేరే ఉన్నారు. మాకు సంతృప్తికరంగానే ఓట్లు వచ్చాయి. అలాగని.. ఈ ఫలితాలు ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం చూపవు.’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
యువతకు పెద్ద ఎత్తున రిక్రూట్‌మెంట్స్ జారీ చేశాము:ఈ ఎన్నికలు ప్రభుత్వ వ్యతిరేకతను ప్రతిఫలించవని.. టీడీపీ సంబరాలు చేసుకోవటంతోనే అంతా అయిపోలేదని సజ్జల పేర్కొన్నారు. ఓటర్లు మొత్తం సమాజాన్ని ప్రతిబింబించే పరిస్థితి లేదని.. అసలు ఒక వర్గం ఓటర్లను మొత్తానికి ఎలా అపాదిస్తారు? అని ఆయన ప్రశ్నించారు. ప్రజలకు అందించే సంక్షేమ పథకాల పరిధిలో పట్టభద్రులు ఓటర్లలో ఎక్కువగా లేరని.. యువతకు పెద్ద ఎత్తున సీఎం జగన్ మోహన్ రెడ్డి రిక్రూట్‌మెంట్స్‌ను జారీ చేశారని వెల్లడించారు.