Amaravati Farmers Fires on Cm Jagan Comments : దిల్లీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖ రాజధానిపై చేసిన వ్యాఖ్యలపై అమరావతి రైతులు మండిపడ్డారు. రాజధానిపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తుండగా.. ముఖ్యమంత్రి ఇలా ప్రకటించటం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం ఇంతవరకు కౌలు చెల్లించకపోవటాన్ని తప్పుబట్టారు. రాజధానిలో దళితులు రోడ్డున పడి ఏడుస్తుంటే.. సీఏం పట్టించుకోరా అని ప్రశ్నించారు. జగన్ మోసపు మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని విమర్శించారు
సీఎం వ్యాఖ్యలపై రైతు ఐకాస ఆగ్రహం: త్వరలో విశాఖ రాజధాని అవుతుందని ఢిల్లీలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై రాజధాని రైతు ఐకాస ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం వ్యాఖ్యలు హైకోర్టు తీర్పును ధిక్కరించటమేనని రైతు ఐకాస స్టీరింగ్ కమిటీ సభ్యులు పువ్వాడ సుధాకర్ అన్నారు. సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు విచారణలో ఉన్న అంశంపై సీఎం ఎలా మాట్లాడతారని రైతులు ప్రశ్నించారు. ముఖ్యమంత్రిపై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని రైతు ఐకాస నేతలు డిమాండ్ చేస్తున్నారు. వివేకా హత్య కేసు అంశం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ముఖ్యమంత్రి ఇలా వాఖ్యానించారని విమర్శించారు. సీఎం స్థాయి వ్యక్తికి రాజ్యాంగం అంటే కనీస గౌరవం లేకపోవడం బాధాకరమని వారు ఆరోపించారు.
"సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను చూస్తుంటే గత మూడు నాలుగు రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న సీబీఐ విచారణ నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ముఖ్యమంత్రి అసందర్భ ప్రేలాపనగా ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం. న్యాయవ్యవస్థను ధిక్కరించే విధంగా మాట్లాడటం దురదృష్టకరం." -సుధాకర్, రైతు ఐకాస స్టీరింగ్ కమిటీ సభ్యులు