Amaravati farmers petition in the Supreme Court: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని భూముల విషయంలో ప్రభుత్వానికి, రైతుల మధ్య సరైన సంధి కుదరటం లేదు. ఆర్-5 జోన్ విషయంలో ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌పై అమరావతి రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆర్-5 జోన్ వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు)లో రైతులు పిటిషన్ వేశారు. రైతులు వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ధర్మాసనం ఎదుట సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. ఈ క్రమంలో సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడి అభ్యర్థనను పరిశీలించిన ధర్మాసనం.. ఏప్రిల్ 14వ తేదీన విచారణ చేపడతామని తెలియజేసింది.
మార్చి 21న గెజిట్ :వివరాల్లోకి వెళ్తే..వైసీపీ ప్రభుత్వం మార్చి నెల 21వ తేదీన ఆర్-5 జోన్ ఏర్పాటు చేస్తూ.. గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఆ నోటిఫికేషన్‌లో.. 900 ఎకరాల భూములను ఆర్-5 జోన్ పరిధిలోకి తెచ్చినట్లు పేర్కొంది. అంతేకాకుండా, అమరావతిలో స్థానికేతరులకు ఇళ్ల స్థలాలను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దమైందని గెజిట్ నోటిఫికేషన్‌లో తెలిపింది. దీంతోపాటు విజయవాడ, గుంటూరు నగరాలకు చెందిన పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రత్యేక జోన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు, మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు గ్రామాల పరిధిలో ఉన్న 900.97 ఎకరాల మేర పేదల ఇళ్ల కోసం జోనింగ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఎంపిక చేసిన భూముల ప్రాంతాన్ని ఆర్-5 జోన్‌గా పేర్కొంటూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది.