R5 Zone Agitation : ఆర్ 5 జోన్ వివాదం మరింత ముదిరింది. రాజధానిలో స్థానికేతరులకు ఇళ్ల స్థలాలు కేటాయించే అంశంలో.. వైసీపీ సర్కార్ మొండిగా ముందుకెళ్తోంది. జోన్ అంశంపై హైకోర్టు నుంచి ఇంకా తీర్పు రాకపోయినా సీఆర్డీఏ అధికారులు దుందుడుకుగా పనులు చేస్తున్నారు. అధికారులు, ప్రభుత్వ అనుసరీస్తున్నా తీరు ఖండిస్తూ రాజధాని గ్రామాల్లో అన్నదాతలు నిరసనలు చేపట్టారు. ఆర్5 జోన్‌కు వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణను తీవ్రతరం చేస్తూ 'ప్రజాచైతన్య యాత్ర'లు చేపట్టాలని రాజధాని రైతు ఐకాస నిర్ణయించింది.
అమరావతిలో ఇతర ప్రాంతాల వారికి ‘నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమం కింద స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మే మొదటి వారానికల్లా పనులు ప్రారంభించేలా చూడాలని ముఖ్యమంత్రి గడువు నిర్దేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికారులు నామినేషన్ పద్ధతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభించారు. శుక్రవారం నుంచి ముళ్ల కంపలను తొలగించి, భూములను చదును చేస్తున్నారు. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ ఐనవోలు సహా వివిధ గ్రామాల్లో రైతులు నిరసనలకు దిగారు.
నిడమర్రులో పనులను అడ్డుకున్న వారిని అరెస్టు చేయడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పేదలకు ఇళ్ల స్థలాల ముసుగులో అమరావతిని నాశనం చేసే కుట్ర జరుగుతోందని.. రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు పరిధిలో ఉన్న అంశంపై సీఆర్డీఏ చర్యలు కోర్టు ధిక్కరణేనని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా తీర్పు రాకముందే పనులు చేపట్టేంత తొందరేంటని నిలదీశారు. అన్నదాతలకు, పేదలకు మధ్య ప్రభుత్వం చిచ్చు పెట్టేందుకు యత్నిస్తోందని ధ్వజమెత్తారు.