Amaravati Bahujana JAC President: అమరావతి రాజధాని ప్రాంతంలో స్థానికేతరులకు సెంటు భూమి పట్టాల పేరిట ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అత్త సొమ్ము అల్లుడి దానం కార్యక్రమం జరుపుతున్నారని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాల కోటయ్య ఆరోపించారు. గత ప్రభుత్వం రాజధాని పేరిట సేకరించిన భూముల్లో తొలి విడతగా 1400 ఎకరాల భూమిని సెంటు పట్టాల రూపంలో పంపిణీకి రేపు తలపెట్టిన బహిరంగసభకు వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలు, నల్ల బెల్లూన్లు ధరించి నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో బాలకోటయ్య మీడియా సమావేశం నిర్వహించారు.
పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామనడాన్ని తాము తప్పు పట్టమని.. ఒక సెంటు కాకుండా రెండు సెంట్లు ఇవ్వాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఏమో సెప్టెంబర్‌లో విశాఖకు వెళ్తా అంటాడు.. అమరావతిలోనే పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటున్నాడు.. ఇంకోవైపు ప్రతిపక్ష పార్టీ నాయకులేమో అధికారంలోకి వచ్చాక ఇళ్ల పట్టాలను రద్దు చేస్తామని అంటుంది. ఎవరితో ఆటలాడుతున్నారు.. ఎవరి మధ్య యుద్ధం పెడుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
పట్టాల కార్యక్రమానికి జన సమీకరణ కోసం ఇప్పటికే వాలంటీర్లు, సచివాలయ కార్యదర్శులకు లక్ష్యాలను నిర్దేశించారన్నారు. 2019లో ప్రతిపక్ష హోదాలో జగన్ మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వస్తే రాజధాని భూములను సెంటు పట్టాలుగా మారుస్తామని అప్పుడు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టుకు పోలీసులకు చేతులు రావడం లేదని.. శవాన్ని ఇంటికి పంపించిన ఎమ్మెల్సీ అనంతబాబుకు సన్మాన సభలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. రాజధాని కోసం భూములు ఇచ్చి.. తమకు అన్యాయం జరిగిందని ఆందోళన చేస్తున్న రైతులు, వారి కుటుంబాలపై పోలీసులు పైశాచికంగా వ్యవహరిస్తున్న దాన్ని ఆయన తప్పుపట్టారు.
"2019లో ప్రతిపక్ష హోదాలో ఉన్న జగన్.. అధికారంలోకి వచ్చాక రాజధాని భూములను సెంటు పట్టాలుగా మార్చి పంపిణీ చేస్తా అని ఏనాడైనా ఒక్క మాట అన్నారా. రాజధానిపై హైకోర్టు తీర్పు.. సుప్రీంకోర్టులో విచారణలు, అమరావతి రైతుల నిరసనలు, ఆందోళనలు అన్నింటిని పోలీసు బలగాలతో తొక్కిపెట్టారు. నిన్న తుళ్లూరులోని దీక్షా శిబిరంలో 100 మంది మహిళలు నిరసనలు చేస్తుంటే.. 1600మంది పోలీసులను దించారు. డీఎస్పీ పోతురాజు పరుష పదజాలాన్ని విన్నారు. గూగుల్ టేక్ అవుట్లో నిందితుడిగా నిర్ధారణ అయిన వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడానికి ఏపీ పోలీసులకు చేతులు రావడం లేదు. మరోపక్క డ్రైవర్ సుబ్రమణ్యాన్ని హత్య చేసిన ఎమ్మెల్యీ అనంతబాబుకు సన్మాన సభలు. రాజధాని కోసం భూములు ఇచ్చాం, మాకు అన్యాయం జరిగిందని రైతులు వాపోతుంటే.. వారిపై పోలీసులు తమ జులుం విధిలించారు"- పోతుల బాలకోటయ్య, అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు
"అత్త సొమ్ము.. అల్లుడి దానంలా.. రాజధాని భూముల పంపకం
ఇవీ చదవండి: