All Party Leaders Support for Agrigold Victims: అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలని విజయవాడలో చేస్తున్న నిరసనలకు అఖిలపక్ష నాయకులు, ప్రజా సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా అఖిల పార్టీ, ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని జగన్ ఇచ్చిన మాట తప్పారు, మడమ తిప్పారని మండిపడ్డారు. బాధితులు సుదీర్ఘ పోరాటం చేసినా ఇప్పటి వరకూ సమస్యను పరిష్కారం చేయలేదంటే సిగ్గు చేటన్నారు. అగ్రిగోల్డ్ బాధితులను జగన్ ప్రభుత్వం మరోసారి మోసం చేసిందన్నారు.
"వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు.. జగన్ మోహన్ రెడ్డి.. మాట తప్పడు, మడమ తిప్పడు అని పదేపదే చెప్తున్నారు. కానీ అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో జగన్ కచ్చితంగా మాట తప్పినట్లే.. ఎందుకంటే ఇవాళ వాళ్ల ఆస్తులు ఉన్నాయి. ఆ ఆస్తులు అమ్మి అయినా సరే ఇచ్చి ఉండచ్చు. దానిపై చిత్తశుద్ధితో ప్రయత్నం చేయట్లేదు. ఏమంటే కోర్టులో వివాదం ఉందని తప్పించుకుంటున్నారు. నీవు ఎవరికైతే మాట ఇచ్చావో.. వారందరికీ మాట తప్పావు. మోసం చేస్తున్నావు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్య సుమారు అయిదారు సంవత్సరాలుగా ఉంది.
ఇది ప్రభుత్వానికి సిగ్గు చేటు. తక్షణమే మూడు వేల కోట్లు ఈ బడ్జెట్ సమావేశాలలోపు కేటాయించి వారి సమస్యను పరిష్కరించాలి. ఆ రకంగా పరిష్కారం చేయలేకపోతే.. కచ్చితంగా వీధి పోరాటాలకు సమాయత్తం అవ్వాలి. కమ్యూనిస్ట్ పార్టీ తరపున మేము మద్దతు ఇవ్వడమే కాదు.. రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు అందరినీ కూడా కూడగట్టి అగ్రిగోల్డ్ బాధితుల అసోసియేషన్ తరపున చేస్తున్న పోరాటానికి పూర్తి స్థాయిలో అండగా ఉంటామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం". - కె.రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి