అందరికీ పోస్టులు లేవనడంపై డీఎస్సీ-98 క్వాలిఫైడ్ అభ్యర్థుల ఆవేదన DSC Qualified Candidates Waiting For Job : అనేక ఏళ్ల పోరాటం ఫలితంగా డీఎస్సీ-98 క్వాలిఫైడ్ అభ్యర్థులందరికీ ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు గత ఏడాది జూన్‌లో ఓ ప్రకటన చేసింది. 62 ఏళ్ల లోపు అర్హులైన వారంతా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆ తర్వాత దీన్ని 60 ఏళ్లకు కుదించింది. ఈ ప్రకారం ప్రకాశం జిల్లాలో దాదాపు 14వందల మంది వరకూ అర్హులైన అభ్యర్థులు ఉన్నప్పటికీ.. 726 మందికి మాత్రమే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకున్నారు. వీరిలో 165 మందికి మాత్రమే ఉద్యోగాలు కల్పిస్తూ అధికారులు తుది జాబితా విడుదల చేశారు. మిగిలిన వారికి పోస్టులు లేవని తేల్చిచెప్పారు. ఇన్నేళ్ల తర్వాత ఉద్యోగం వచ్చిందని సంతోషిస్తే.. ఇప్పుడు పోస్టులు లేవనడంపై 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
"మాకు ఉద్యోగాలు వచ్చాయని ప్రైవేటు స్కూళ్లలో తీసుకోవటం లేదు. మేము ఉద్యోగాలకు ఎంపికయ్యామని.. తీసుకుంటే మధ్యలో వదిలేసి వెళ్తామని తీసుకోవటం లేదు. రోడ్డున పడ్డాము. ఎంతో మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మా జీవితాలు బలైపోతున్నాయి. మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి. చివరకి ప్రైవేటు ఉద్యాగాలు కూడా చేసుకోలేక పోతున్నాము." -గూడూరు సుదీప్ రాజు, 1998 డీఎస్సీ అభ్యర్థి
సీఎం జగన్ హమీ ఇచ్చినా, అధికారులు మాత్రం ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని.. 98 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులు ఏలూరులో ఆవేదన వ్యక్తంచేశారు. రోస్టర్ ఆఫ్ రిజర్వేషన్స్ పాటించకుండా.. కేవలం ఆర్డర్ ఆఫ్ మెరిట్ విధానంలో ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా చాలా మంది నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నామంటూ వాపోయారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రితో పాటు ప్రజాప్రతినిధులకు గోడు వెళ్లబోసుకునేందుకు.. జిల్లా సమీక్షా కమిటీ సమావేశానికి వచ్చారు. అందరికీ ఉద్యోగాలు ఇస్తామన్న ప్రభుత్వ ప్రకటనతో అప్పటి వరకూ పనిచేస్తున్న చిన్న చిన్న ప్రైవేట్ ఉద్యోగాలను వదిలేశామని.. ఇప్పుడు పోస్టులు లేవంటే తమ పరిస్థితి ఏంటని బాధితులు ప్రశ్నిస్తున్నారు.
"మాకు జరిగిన అన్యాయం మాములు విషయం కాదు. మొన్నటి వరకు క్వాలిఫై అయిన వారికి అందరికి వస్తుందని అన్నారు. కానీ, ఇప్పుడు మెరిట్ విధానంతో.. రోస్టర్ విధానం అమలు చేయకుండా ఉద్యోగాలు కల్పించారు. కమ్యూనల్ విధానం లేదు. ఎస్సీ, ఎస్టీ, వర్గాల వారికి ఉద్యాగాలు లేవు. 98 క్వాలిఫై అయినవారికి అందరికి ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. క్వాలిఫై అయిన వారందరికి ఉద్యోగాలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము." - కాళీ నెహ్రూ, 1998 డీఎస్సీ అభ్యర్థి
ఇవీ చదవండి :