Air pollution in Hyderabad : దేశ రాజధాని దిల్లీ తరహాలోనే హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో కాలుష్యం పెరిగిపోతోంది. సనత్‌నగర్‌లో వాయు నాణ్యత ఆందోళనకరంగా ఉందని కేంద్ర కాలుష్య నియంత్రణమండలి తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈనెల 7న సాయంత్రం 5 గంటలకు గాలి నాణ్యత సనత్‌నగర్‌లో 213 పాయింట్లుగా నమోదైంది. ఇదే సమయంలో జూపార్కు వద్ద 162, హెచ్‌సీయూ 101, రామచంద్రాపురం 77, మలక్‌పేట 55 పాయింట్లుగా నమోదైంది. ఇతర మెట్రో నగరాలు ముంబయి, చెన్నై, బెంగుళూరు నగరాల్లోనూ కాలుష్యం పెరుగుతోంది. కేంద్ర కాలుష్య నియంత్రణమండలి తాజా గణాంకాల ప్రకారం గాలి నాణ్యతా సూచీల్లో ముంబయి 232, బెంగుళూరు119, చెన్నై105 పాయింట్లు నమోదయ్యాయి.
చలిపెరగడంతో దుమ్మూ, ధూళి, వాహనాల పొగ.. గాలిలో కలవడం లేదు. పైపైనే ఒక పొరలా పేరుకుపోతోంది. దీంతో గాల్లో కాలుష్యం పెరిగి.. వాయు నాణ్యత తగ్గుతోంది. దీపావళి పండుగ నుంచి గాల్లో నాణ్యత క్రమంగా క్షీణిస్తోంది. బాణసంచా కాల్చడంతో మూడింత కాలుష్యం పెరిగింది. తర్వాతి రోజుల్లో గాలి నాణ్యత పర్వాలేదన్న స్థాయికి చేరుకున్నా.. వారం రోజుల నుంచి గాల్లో నాణ్యత తగ్గుతోంది. పరిశ్రమలు ఎక్కువగా ఉన్న సనత్‌నగర్ పరిసర ప్రాంతాల్లో గాలి ఎక్కువగా కలుషితమవుతోంది. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం ఐదుగంటల వరకూ కాలుష్య లెక్కింపు పరికరంలో గరిష్ఠంగా 324 పాయింట్లు నమోదయ్యాయి. 2.5 మైక్రాన్ల మందమున్న సూక్ష్మధూళి కణాలు కొన్ని కోట్లలో అక్కడ ఉండడం కాలుష్యం పెరిగేందుకు ప్రధాన కారణమైంది.