AIG Chirman Dr.Nageshwar Reddy on BF-7 : ఒమిక్రాన్‌కు చెందిన బీఎఫ్-7 ఇప్పుడు మన దేశంలోకీ ప్రవేశించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సహా రాష్ట్రాలన్నీ అప్రమత్తమవుతున్నాయి. ఈ బీఎఫ్-7 వేరియంట్‌పై ఏఐజీ ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. హెటిరోలోగస్ వ్యాక్సిన్లను బూస్టర్ డోస్‌లుగా తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు సాధించవచ్చని డా.నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. మొదటి రెండు డోసులు కొవిషీల్డ్ తీసుకున్న వారిలో కార్బీవ్యాక్స్ని బూస్టర్ డోస్‌గా ఇవ్వటం ద్వారా ఎక్కువ మొత్తంలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నాయని పేర్కొన్నారు. చైనాలో వచ్చినంత ఎక్కువగా భారత్‌లో కొవిడ్ కొత్త కేసులు వచ్చే అవకాశం లేదని ఆయన వెల్లడించారు.
'కరోనా కొత్త వేరియంట్ భారతీయులపై పెద్దగా ప్రభావం చూపదు' - డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి
AIG Chirman Dr.Nageshwar Reddy on BF-7 : ఒమిక్రాన్ కొత్త రూపాంతరం బీఎఫ్-7 భారతీయులపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని ఏఐజీ ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి వెల్లడించారు. కొవిడ్ వ్యాక్సిన్ల పనితీరు బూస్టర్ డోస్‌లపై ఏఐజీ నిర్వహించిన సర్వేని వ్యాక్సిన్స్ సైన్స్ జనరల్‌లో పబ్లిష్ చేసినట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఏఐజీ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
చైనాలో ఇచ్చిన వ్యాక్సిన్‌లు తక్కువ నాణ్యత కలిగినవని ఆయన చెప్పారు. చైనా ఇప్పటి వరకు జీరో కొవిడ్ విధానాన్ని పాటించిందని.. కానీ ఇటీవలే అక్కడ కొవిడ్ నిబంధనలు సడలించారన్నారు. అందుకే కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని పేర్కొన్నారు. భారత్‌లో అక్టోబరులోనే ఈ బీఎఫ్-7 కేసులు వెలుగు చూశాయి కానీ పెద్దగా ప్రభావం చూపలేదన్నారు. బీఎఫ్-7 ఒక్కరి నుంచి 10 మందికి వ్యాపిస్తుందన్న ఆయన.. భారత్‌లో వస్తున్న కొవిడ్ కేసులలో 80 శాతం ఎక్స్ బీబీ రకానివే అని స్పష్టం చేశారు. బూస్టర్ డోస్‌గా ఒకే రకం వ్యాక్సిన్‌కు బదులుగా భిన్నమైన వ్యాక్సిన్ తీసుకోవడం మంచిదని ఆయన.. కొవిడ్ బీఎఫ్-7 ప్రాణాంతకం కాదని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: