Agros Delay in Rythu Seva Kendra : గతేడాది నవంబర్ 25వ తేదీన ఆగ్రో రైతు సేవా కేంద్రాల ఏర్పాటుకు.. రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ ప్రకటన జారీ చేసింది. ప్రతి మండలంలో ఒక ఏఆర్ఎస్కే కేంద్రాన్ని ఏర్పాటు చేసి.. వాటి ద్వారా ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు, వ్యవసాయ పనిముట్లు అందించేందుకు పట్టభద్రుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 200 మంది అభ్యర్థులు.. తొలి విడతగా దరఖాస్తులు చేసుకుని ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఇందులో 150 మంది అభ్యర్థులు ఆగ్రో రైతు సేవా కేంద్రాల ఏర్పాటుకు అర్హత పొందారు. రెండో విడత నిర్వహించిన ఇంటర్వ్యూకు సుమారు 100 మంది హాజరుకాగా.. అందులో 75 మంది అర్హత సాధించారు. ఒక్కో అభ్యర్థి నుంచి లక్షా పది వేల రూపాయల చొప్పున డీడీలు వసూలు చేశారు. మార్చి మొదటి వారంలోగా లైసెన్సు పత్రాలు అందిస్తామని చెప్పినా.. ఇంతవరకు అనుమతి పత్రాలు ఇవ్వలేదని అభ్యర్థులు వాపోతున్నారు.
"మా ద్వారానే ఎరువులు, పురుగు మందులు పంపిణీ చేస్తామని అంటే.. మా ఏఆర్ఎస్కే వాళ్లము లక్ష పదివేల రూపాయలు చెల్లించినాము. నగదు చెల్లించి నెలలు గడుస్తోంది. ఎంతసేపు.. మాతో స్పేయర్లు. పట్టాల లాంటివి మాత్రమే మాతో అమ్మిస్తున్నారు. ఎరువులు అందించటం లేదు." -వీరనారాయణరెడ్డి, బద్వేలు
"ఈ పక్రియ నవంబర్ నెలలో ప్రారంభమైంది. నెలన్నర రోజుల తర్వాత సీజన్ ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు ఆగ్రో సంస్థ పక్రియ ఎలా సాగుతోందో మాకు తెలియదు. మాకు ఎరువులు, పురుగుమందులు, యాంత్రీకరణ లేదు. కనీసం ఎప్పుడు ఇస్తారో కూడా మాకు తెలియదు." -సాదక్‌పీరా, తాడిపత్రి