Agriculture Minister Kakani Govardhan Reddy : రాష్ట్రంలోని అన్ని జిల్లాల డీసీసీబీల అధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సమావేశమయ్యారు. రాబోయే రోజుల్లో సహకార బ్యాంకుల్లో తీసుకువస్తున్న నియామాలు, అందించనున్న సేవలపై చర్చించారు. సహకార బ్యాంకులు అందితీస్తున్న సేవలు, పనితీరుపై సమీక్షించారు. ఈ సమావేశంలో అధికారులకు పలు సలహాలు, సూచనలను అందించారు. పరపతి సంఘాలు పని చేయటానికి అవసరమయ్యే కృషి చేయాలని అధికారులకు సూచించారు.
ఆప్కాబ్, డీసీసీబీలకు ఒకే రూల్స్ : సహకార వ్యవస్థను బలోపేతం చేసేలా కార్యాచరణ రూపొందించినట్టు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. జిల్లాల కేంద్ర సహకార బ్యాంకుల పర్సన్ ఇంఛార్జీలతో రాష్ట్ర వ్యవసాయ, సహకార మార్కెటింగ్ శాఖ మంత్రి కాకాణి సమావేశమయ్యారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలపై చర్చించారు. ఆప్కాబ్, డీసీసీబీ బ్యాంకులకు ఒకే సర్వీస్ రూల్స్ వర్తించేలా.. రాష్ట్ర స్థాయిలో ఒక పాలసీనీ రూపొందించడానికి చర్యలు తీసుకు వస్తున్నట్టు తెలిపారు. ఇందుకోసం అవసరమైన సలహాలు, సూచనలు డీసీసీబీ అధికారులతో చర్చించారు. పొరుగు రాష్ట్రాలలోని ఆప్కాబ్ బ్యాంకులు.. లాభాల్లో ఉన్నట్లు సంబంధిత అధికారులు తెలిపారని అన్నారు. వారు బ్యాంకుల ద్వారా బహుళమైన కార్యక్రమాలను చేపట్టడం ద్వారా.. వారికి ఈ లాభాలు వచ్చాయని తెలిపారు.