OP Services in Government General Hospitals: ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందేందుకు రోజుల తరబడి సమయం వెచ్చించాల్సి వస్తుంది. ఆసుపత్రిలో ఉదయం పూట వైద్యులు రోగులను పరిశీలించి వైద్య పరీక్షలు రాస్తారు. వైద్య పరీక్షలు చేయించుకున్న తర్వాత వాటి ఫలితాలు అదే రోజు రావటం లేదు. దీంతో సాధారణ రక్త పరీక్షలు చేయించుకున్న వాళ్లు సైతం ఫలితాల కోసం మరుసటి రోజు రావాల్సి వస్తుంది.
సాధారణంగా విజయవాడ లాంటి బోధనాసుపత్రులకు రాష్ట్ర నలుమూలల నుంచి రోగులు వస్తుంటారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వారిలో అధికంగా పేదలే ఉంటారు. దూరప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు వైద్య పరీక్షల కోసం మరోరోజు రావాలంటే కష్టమవుతుంది. రవాణా ఖర్చుల భారం మోయలేకపోతున్నారు.
ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం మంగళగిరి ఎయిమ్స్ తరహాలో వైద్య సేవలను అందుబాటులోకి తేవాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనిక్, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, ఆప్తమాలజీ, పల్మనాలజీ, చర్మవ్యాధుల విభాగాల్లో వైద్యసేవల సమయాన్ని పెంచుతూ ప్రభుత్వం బోధనాసుపత్రులకు ఆదేశాలు జారీ చేసింది.
వైద్యులు సాయంత్రం ప్రస్తుతం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వైద్యులు ఓపీలో విధులు నిర్వహించి.. మధ్యాహ్నం వైద్యకళాశాలలో విద్యార్ధులకు విద్యాబోధన చేస్తారని విజయవాడ జీజీహెచ్ సూపరింటెండ్ డా.సౌభాగ్యలక్ష్మీ తెలిపారు. తాజా ఆదేశాలతో వైద్యకళాశాల ప్రిన్సిపల్, విభాగాధిపతులతో సమావేశం ఏర్పాటు చేసి సాయంత్రం 3 నుంచి 4 గంటల వరకు వైద్యులు ఓపీ చూసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.