Advocates protest cases against a colleague: అక్రమ మైనింగ్ వ్యవహారంపై ప్రశ్నించినందుకు న్యాయవాది మీద జరిగిన దాడిని విజయవాడ బార్ అసోసియేషన్ ఖండించింది. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు రిలే దీక్షలు చేపట్టారు. న్యాయవాదులపై దాడులు, అక్రమ కేసులు పెట్టడంపై న్యాయవాదులు తీవ్రంగా ఖండించారు. ఈ అంశంపై కేంద్ర, రాష్ట్రాలు స్పందించాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. లేకుంటే తమ ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
కృష్ణాజిల్లా గూడూరు మండలంలో న్యాయవాది హరిరామ్‌పై జరిగిన దాడిని న్యాయవాదులు ఖండించారు. అక్రమ మైనింగ్‌పై ప్రశ్నిస్తే న్యాయవాదిని కొడతారా అంటూ ప్రశ్నించారు. బెజవాడ బార్ అసోసియేషన్ ప్రాంగణంలో న్యాయవాదుల రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు . గూడూరు మండలం, ఆకుమురులో జరుగుతున్న మట్టి తవ్వకాలపై న్యాయవాది బత్తిన హరిరామ్ ప్రశ్నించేందుకు వెళ్లారు. దీంతో అక్కడున్న కొందరు ఆయనపై దాడి చేశారని బార్ అసోసియేషన్ అధ్యక్షులు సుందర్ చెబుతున్నారు. ఇది న్యాయవ్యవస్థపై దాడిగా పరిగణిస్తున్నామని అన్నారు. కొందరు అక్రమార్కులు న్యాయవాదిపై దాడి చేస్తుంటే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. దాడికి గురైన బాధితుడు న్యాయవాది హరిరామ్ ఫిర్యాదు పరిగణలోకి తీసుకోని పోలీసులు .. దాడి చేసిన వారి ఫిర్యాదును ప్రధానంగా తీసుకొని కేసు నమోదు చేయడం సరికాదన్నారు. పోలీసుల తీరుపై గవర్నర్, సీజే, డీజీపీకి ఫిర్యాదు చేయనున్నట్లు సుందర్ తెలిపారు. న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు.