ADVOCATES PROTEST AT CIVIL COURTS: అతనొక న్యాయవాది. అన్యాయం జరిగిన బాధితులకు కోర్టులో వాదించి న్యాయం చేసే వ్యక్తి. అలాంటి వ్యక్తి తన కుమార్తె లైగింక వేధింపులకు గురవుతున్నట్లు పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే.. పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో ఆగ్రహించిన న్యాయవాదులు రోడ్డుపై బైఠాయించి నిరసనలు తెలిపారు. భవానీపురం సీఐ ఉమర్, ఏఎస్ఐ గంగాధర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తప్పు చేసిన వారిపై కేసు నమోదు చేయని పోలీసులు.. తిరిగి న్యాయవాది పైనే కేసు నమోదు చేశారని లాయర్లు ఆందోళన వ్యక్తం చేశారు.
"సీఐ ఉమర్ చట్టాన్ని తన చేతుల్లో ఉంచుకుని ఇలాంటి దుర్మార్గమైన చర్యలకు పాల్పడి.. ఒక న్యాయవాది కుటుంబం అందులోనూ మైనర్ బాలిక విషయంలోనే ఇలా చేస్తే.. ఇంకా సామాన్యుల విషయంలో ఎంత దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతున్నారో ఆలోచించాల్సిన సమయం. మా లాయర్.. ఆ అబ్బాయి వాళ్ల ఇంటికి వెళ్లి నిలదీసి మీ అబ్బాయి ఇలా చేశాడు అని చెప్తే.. వీళ్లని పోలీసుస్టేషన్‌కు పిలిపించి వీళ్ల పైనే కేసులు నమోదు చేశారు. బాధితులకు అన్యాయం జరిగితే సీఐ మొదటి ముద్దాయి. సీఐని సస్పెండ్ చేయడానికి అన్ని అధికారాలు ఉంటాయి. సీఐ ఉమర్‌ను విధుల నుంచి వెంటనే తప్పించాలి. అప్పటి వరకూ ఈ సమ్మె ఆగదు. రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు ఆందోళనలు చేస్తూనే ఉంటారు"-న్యాయవాది