RTC Employees Problems in AP : కేడర్ స్ట్రెంత్ పేరుతో ఏపీఎస్ఆర్టీసీలో ఇచ్చిన సర్దుబాటు ఉత్తర్వులు ఉద్యోగులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఆర్టీసీలో గతంలో బస్సుల సంఖ్యను బట్టి వాటికి ఎంత మంది డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు, ఇతర సిబ్బంది అవసరమవుతారనే నిష్పత్తి ఉండేది. దీనికి సంబంధించి 2011 నార్మ్ అనేది అమలు చేశారు. ఐతే 2020లో ఆర్టీసీ ప్రభుత్వంలో ప్రభుత్వంలో విలీనం అయ్యాక, అప్పటికి ఉన్న ఉద్యోగుల సంఖ్యకు ప్రభుత్వం నుంచి ఆమోదం తీసుకున్నారు. తర్వాత వివిధ డిపోల పరిధిలో ఆయా కేడర్ల ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చారు.
దీన్ని ఆయా డిపోల్లోని వివిధ కేడర్లలో ఉద్యోగుల సంఖ్య పెరిగినట్లు లెక్కలు వేశారు. ఈ నేపథ్యంలోనే అదే కేడర్‌తో ఇతర జిల్లాల్లో ఖాళీలున్న డిపోలకు వారిని సర్దుబాటు చేసినట్లు చూపిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. పని చేస్తున్న డిపో, జిల్లా పరిధి కాకుండా సుదూర ప్రాంతాల్లో వారికి పోస్టింగ్ ఇచ్చినట్లు చూపారు. కానీ విధులు మాత్రం ప్రస్తుతం ఉన్న చోటే నిర్వహిస్తున్నారు. దీని వల్ల చాలా కోల్పోయామని ఉద్యోగులు అంటున్నారు.
తప్పుపడుతున్న ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలు :సర్దుబాట్ల పేరిట చిత్తూరు, అలిపిరి, మంగళం, పుత్తూరు, తిరుమల, తిరుపతి ఆర్టీసీ డిపోల్లో పని చేస్తున్న పలువురు గ్రేడ్-1 ఎలక్ట్రీషియన్లను ఉమ్మడి విజయనగరం,శ్రీకాకుళం పరిధిలోని రీజియన్‌లో సర్దుబాటు చేసినట్లు ఉత్తర్వులు ఇచ్చారు. అలాగే ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర డిపోల్లో పని చేసే వారిని రాయలసీమలోని వేర్వేరు డిపోలకు సర్దుబాటు చేశారు. అసలు ఓ శాస్త్రీయతంటూ లేకుండా చేశారని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలు తప్పుపడుతున్నారు.