ACB Court on Chandrababu Health Petition: టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితుల గురించి తెలుసుకునేందుకు ఆన్‌లైన్ ద్వారా ఆయనను మంగళవారం తమ ముందు హాజరుపరచాలని రాజమహేంద్రవరం కేంద్ర కారాగార అధికారులకు విజయవాడ ఏసీబీ కోర్టు స్పష్టంచేసింది. ఇకపై వైద్య నివేదిక ఓ ప్రతిని చంద్రబాబుకి ఇవ్వాలని పేర్కొంది. ఏసీబీ కోర్టు న్యాయాధికారి హిమబిందు ఈ మేరకు తెలిపారు. చంద్రబాబును పరిశీలించిన వైద్య బృందం ఈ నెల 14న ఇచ్చిన నివేదికను తమకు ఇచ్చేందుకు జైలు అధికారులు నిరాకరిస్తున్నారని, అవి పొందాలంటే న్యాయస్థానం నుంచి తగిన ఆదేశాలు తీసుకోవాలంటున్నారని పేర్కొంటూ చంద్రబాబు న్యాయవాదులు అత్యవసరంగా ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు.
ఈ నేపథ్యంలో పిటిషనర్ తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. వైద్య నివేదికలను ఇవ్వాలని న్యాయస్థానంలో సర్టిఫైడ్ కాపీ కోసం అప్లికేషన్ వేస్తే.. జైలు అధికారుల నుంచి భౌతికంగా దస్త్రం అందాకే ఇస్తామంటున్నారన్నారని న్యాయాధికారి దృష్టికి తీసుకెళ్లారు. కోర్టు నుంచి అనుమతి తీసుకోవాలని జైలు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారన్నారు. వైద్య నివేదికను పొందే హక్కు పిటిషనర్, ఆయన కుటుంబ సభ్యులకు ఉందన్నారు. పిటిషనర్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతోందన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయాధికారి.. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితుల గురించి తెలుసుకునేందుకు మంగళవారం ఆన్‌లైన్ ద్వారా(బ్లూజీన్స్ యాప్) తమ ముందు హాజరుపరచాలని జైలు అధికారులను ఆదేశించారు.
కాగా చంద్రబాబు ఆరోగ్య నివేదిక ఇవ్వాలని కోరుతూ ఏసీబీ కోర్టులో కుటుంబసభ్యులు వేసిన పిటిషన్‌పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. విజయవాడ ఏసీపీ కోర్టులో చంద్రబాబు కుటుంబ సభ్యులు నిన్న పిటిషన్ వేశారు. చంద్రబాబు ఆరోగ్యంపై ఆందోళన ఉందని కుటుంబ సభ్యులు పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో చంద్రబాబును నేడు ఆన్‌లైన్ ద్వారా హాజరుపరచాలని విజయవాడ ఏసీబీ కోర్టు.. రాజమండ్రి జైలు అధికారులకు స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఇకపై వైద్య నివేదిక ఒక ప్రతిని చంద్రబాబుకు ఇవ్వాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది.
సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్..
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుక్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో నేడు తుదివాదనలు జరగనున్నాయి. గవర్నర్ ముందస్తు అనుమతి లేకుండా తనపై నమోదు చేసిన స్కిల్ కేసు కొట్టివేయాలని సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్ దాఖలు చేయగా.. వాదనలు కొనసాగుతున్నాయి. నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించనున్నారు. శుక్రవారం ప్రభుత్వ వాదనలు పూర్తికానందున ఇవాళ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించనున్నారు. రోహత్గీ వాదనలు పూర్తయ్యాక హరీష్ సాల్వే కౌంటర్ వాదనలు ప్రారంభంకానున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం విచారణ చేపట్టనుంది.