ACB Court Judge Serious on Both Sides Lawyers:స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి.. ఇరుపక్షాల న్యాయవాదులపై విజయవాడ ఏసీబీ కోర్ట్ న్యాయాధికారి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సీఐడీ అధికారుల కాల్‌డేటాపై న్యాయవాదులు చేసుకున్న వాదోపవాదనలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువైపులా న్యాయవాదులు పరస్పరం కేకలు వేసుకోగా.. ఇలాగైతే విచారణ నిలిపివేస్తానని, మొత్తం పరిణామాలపై హైకోర్టుకు ఫిర్యాదు చేస్తానని న్యాయాధికారి హెచ్చరించారు. ఓ దశలో బెంచ్ పైనుంచి దిగి వెళ్లిపోయారు.
అసలు ఏం జరిగిందంటే.. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడ్ని అరెస్టు చేయడానికి ముందు.. దర్యాప్తు అధికారులు ఎవరెవరితో మాట్లాడారో కాల్‌డేటాను తమకివ్వాలంటూ చంద్రబాబు తరపు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌పై గురువారం ఏసీబీ కోర్ట్ విచారణ జరిపింది. విచారణలో భాగంగా సమయంలో ఇరుపక్షాల న్యాయవాదుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు పరస్పరం కేకలు వేసుకోవడంతో న్యాయాధికారి తీవ్ర అసహనం చెందారు. ఇలాగైతే, ఈ పిటిషన్‌పై విచారణ నిలిపివేస్తానని.. మొత్తం పరిణామాలపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (హైకోర్టు)కు ఫిర్యాదు చేస్తానని వ్యాఖ్యానించారు. అనంతరం బెంచ్‌పై నుంచి న్యాయాధికారి దిగి వెళ్లిపోయారు.
Chandrababu Lawyers Arguments: అంతకు ముందు సీఐడీ అధికారుల కాల్‌డేటా రికార్డ్స్ ఇవ్వాలన్న పిటిషన్‌పై చంద్రబాబు తరపు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. ''గత నెల ఎనిమిదో తేదీ రాత్రి పది గంటలకు చంద్రబాబును అరెస్టు చేశారు. అరెస్ట్ అనంతరం 24 గంటలపాటు నిర్భంధంలో ఉంచారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచారు. అయితే, దర్యాప్తు అధికారి కాకుండా పర్యవేక్షకాధికారి అరెస్టు చేశారు. దర్యాప్తు అధికారి కాకుండా ఈ కేసులో ఇతరులు ఎవరెవరి ప్రమేయం ఉందో, వారి కాల్‌డేటా మొత్తం కోర్టుకు తెప్పించి భద్రపరచాలి'' అని చంద్రబాబు తరుఫు న్యాయవాదులు కోర్టును కోరారు.