New political party will be formed in AP: ఆంధ్రప్రదేశ్‌లో అతి త్వరలోనే నూతన రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నామని, ఇప్పటికే పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నాయని.. మాజీ ఐఎఎస్ అధికారి వి.జి.ఆర్ నారగోని తెలిపారు. విజయవాడలోని ఓ హోటల్‌లో బీసీ సంఘాల నాయకులు రామకృష్ణయ్య, అన్నా రామచంద్రయాదవ్, విశ్రాంత ఆచార్యులు ఆకురాతి మురళికృష్ణ ఆధ్వర్యంలో విలేఖర్ల సమావేశం ఏర్పాటు చేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీసీల నేతృత్వంలో ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్లతో ఒక బలమైన రాజకీయ శక్తిని, ఒక కొత్త రాజకీయ పార్టీని స్థాపించాలని నిర్ణయించామన్నారు. రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా వెనకబడిన వర్గాలను ప్రధాన పార్టీలన్నీ ఓటు బ్యాంక్‌గా మాత్రమే చూస్తున్నారు తప్పా.. ఎమ్మెల్యేలు, ఎంపీలుగా అవకాశాలు ఇవ్వటం లేదన్నారు. అందుకే రాజ్యాంగం కల్పించిన హక్కుల రక్షణ కోసం ఒక నూతన రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు.
అనంతరం బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కోసం ఒకే పార్టీ.. ఒకే జెండాను ఏర్పాటు చేస్తామన్నారు. వైసీపీ, టీడీపీలు బీసీలకు తీవ్రమైన అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు. త్వరలోనే విజయవాడలో లక్ష మందితో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి.. నూతన పార్టీ పేరును, జెండాను ప్రకటిస్తామన్నారు. నూతన పార్టీ కార్యాలయం విజయవాడలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే పార్టీకి సంబంధించి దిల్లీలో కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు.