Sankranti Festival Special Food : పెద్ద పండగకు వారం రోజులు ముందు నుంచే మహిళామణులు గుమగుమలాడే పిండి వంటలను సిద్ధం చేస్తారు. మగ మహారాజులు తమ చిరకాల స్నేహితులతో బిజీగా ఉంటే.. మహిళలు పాకశాలల్లో వంటల తయారీలో నిమగ్నమై ఉంటారు. వారు తయారు చేసిన పిండి వంటలు బోలెడు పోషకాలను అందిస్తాయి. అవేంటో ఒకసారి ఓ లుక్కేద్దామా మరీ.!
పరమాన్నం/పొంగలి:సంక్రాంతి నాడు పరమాన్నం/పొంగలి తప్పనిసరిగా వండుకుంటాం. పాలూ, బెల్లం, బియ్యం, యాలకులపొడి వేసి చేసే ఈ వంటకం ఉడికేటప్పుడు గరిటెకు బదులు చెరకు ముక్కలతో తిప్పుతూ ఉంటారు. దీంతో దీనికి మరింత రుచి వస్తుంది. చెరకు జీర్ణశక్తికి మేలు చేస్తుంది. ఒంట్లోని వేడిని తగ్గిస్తుంది. ఇందులో వాడే పాల నుంచి క్యాల్షియం, ఫాస్ఫరస్ మెగ్నీషియం... తక్షణ శక్తిని అందిస్తాయి. ఎముకలూ, దంతాల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇక, ఉడికించిన అన్నం నుంచి జింక్, మాంగనీస్ అధికంగా లభిస్తాయి. పరమాన్నంలో బెల్లందే కీలక పాత్ర. ఇందులోని ఖనిజాలు రోగ నిరోధక శక్తిని పెంచి, జీర్ణవ్యవస్థను మెరుగ్గా పనిచేసేలా చేస్తాయి. రక్తహీనతనూ దరిచేరనివ్వవు. యాలకులు నోటి దుర్వాసన దూరం చేస్తాయి.
అరిసెలు:సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు మొదట గుర్తొచ్చేవి అరిసెలే.. బెల్లంతో చేసిన అరిసెలు ఆరోగ్యానికి శ్రేష్టం. వీటి తయారీలో కొత్త బియ్యపు పిండి, నూనె, బెల్లం, నువ్వులు వాడతారు. ఇందులో వాడే బెల్లం రక్తాన్ని శుద్ధి చేయడంతోపాటు శరీరంలో ఉన్న వ్యర్థాలను తొలగిస్తాయి. వీటిలో కార్బొహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఐరన్‌తో పాటు పలు పోషకాలూ శరీరానికి లభిస్తాయి.
సున్నుండలు:పండక్కి వచ్చే కొత్త అల్లుళ్లను మెప్పించడానికే కాదు... ఆటలతో అలసిపోయే చిన్నారులకూ, పనులతో ఒత్తిడికి గురయ్యే మహిళలకూ తక్షణ శక్తినీ, పోషకాలనూ పుష్కలంగా అందించే స్వీటు సున్నుండ. దీని తయారీకి వాడే మినపప్పులో శరీరానికి కావలసిన ప్రొటీన్లూ, కొవ్వులూ, కార్బోహైడ్రేట్లూ పుష్కలంగా దొరుకుతాయి. ఇవి రోజంతా ఉత్సాహంగా ఉండగలిగే శక్తిని అందిస్తాయి. శరీర జీవక్రియా రేటుని మెరుగుపరుస్తాయి. బెల్లం రక్తాన్ని శుద్ధిచేస్తే, నెయ్యి ద్వారా ప్రొటీన్లు, అందుతాయి. హోర్మోన్లను సమతుల్యంగా ఉంచడంలో సున్నుండలు బాగా పనిచేస్తాయి.