ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

aasara Scheme: ఆసరా నగదుపై లబ్ధిదారులు ఆశలు.. డిజిటల్ తెరలపై అధికార పార్టీ నేతలు ప్రదర్శనలు

aasara Scheme latest news: ఆసరా పథకానికి సంబంధించి లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పటం లేదు. దాదాపు 73 వేల మంది లబ్దిదారులు ఆసరా కోసం ఎదురుచూస్తుండగా.. ఇప్పటికీ 50% స్వయం సహాయక సంఘాల ఖాతాల్లో నగదు జమకాలేదు. దీంతో డీబీటీ (DBT) పేరుతో ముఖ్యమంత్రి చెబుతున్నవి నిజాలా లేక.. డప్పు కొడుతున్నారా.. అని ప్రజలు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

aasara Scheme
aasara Scheme

By

Published : May 6, 2023, 2:14 PM IST

ఆసరా నగదు కోసం లబ్ధిదారుల ఎదురుచూపులు..

aasara Scheme latest news: 'ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా పేదలను ఆదుకుంటున్నాం. సంక్షేమ పథకాలను నేరుగా ప్రజలకు అందిస్తున్నాం. బటన్ నొక్కుతున్నాం. అర్హుల ఖాతాల్లోనే నగదు జమ చేస్తున్నాం. లబ్దిదారులకు మేలు చేస్తున్నాం.' అని సీఎం జగన్‌తోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రతినిత్యం ఏదో చోట ఉపన్యాసాల మీద ఉపన్యాసాలు ఇస్తూనే ఉన్నారు. అంతేకాదు, బటన్‌ నొక్కిన నిమిషాల వ్యవధిలోనే నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమవుతున్నట్లు.. వీడియోలను డిజిటల్ తెరలపై ప్రదర్శించి, ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, క్షేత్రస్థాయిలో మాత్రం ప్రభుత్వ పెద్దలు చెప్తున్న మాటలకి సరైన పొంతన కనిపించటంలేదని లబ్దిదారులు ఆవేదన చెందుతున్నారు. తమ ఖాతాల్లోకి డబ్బులు జమ కాలేదని వాపోతున్నారు. ఆసరా పథకానికి సంబంధించి సీఎం జగన్‌.. బటన్ సరిగా నొక్కిలేదని విమర్శిస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రం మొత్తం మీద లక్షలాది మంది లబ్దిదారులకు ఆసరా పథకం మూడో విడత నిధులు అందలేదు. నెలలు గడుస్తున్నా కూడా మహిళల ఖాతాల్లో నగదు ఇంకా జమకాలేదు.

నేరుగా మీ ఖాతాల్లోకి మీ డబ్బులు వేస్తున్నాం..మార్చి 25న ఏలూరు జిల్లా దెందులూరులో ఆసరా సాయం మూడో విడత నిధుల విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ చెప్పిన మాటలివి. మీ డబ్బులు నేరుగా మీ ఖాతాల్లోకి వేస్తున్నాం. అడ్డెవరూ లేరు. అవినీతి లేదంటూ గొప్పగా చెప్పారు. రాష్ట్రంలో 78.94 లక్షల మంది అక్క చెల్లెమ్మలను రుణ విముక్తుల్ని చేసేందుకు ఆసరా పథకం ప్రవేశపెట్టామన్నారు. అందులో మొత్తంగా రూ. 25వేల 517 కోట్ల రూపాయలు 4 విడతల్లో అందించనున్నట్లు వెల్లడించారు. ఆ ప్రకారం.. 2020 సెప్టెంబర్‌ మొదటి విడతలో రూ. 6,318 కోట్లు, 2021 అక్టోబర్‌లో రెండో విడతలో రూ. 6,440 కోట్ల రూపాయలు అందించారు. మూడో విడత ఆసరా 2022లో రావాల్సి ఉన్నా నిధుల సమస్యతో ఇవ్వలేదు. 2023లో మార్చిలో ఆ రూ. 6,419 కోట్లు జమ చేస్తున్నట్లు సీఎం జగన్‌ ప్రకటించారు. ఇప్పటికి అందిన 3 విడతల్లో రూ.19,178 కోట్లు ఇచ్చామని దెందులూరు సభలో గొప్పగా ప్రకటించారు. ఈ డబ్బుతో మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఏదైనా వ్యాపారానికి వినియోగించు కోవచ్చని సూచించారు. కానీ, ఆ మాటలు అమలుకు ఆమడ దూరంలోనే ఉన్నాయి.

లబ్దిదారుల ఖాతాల్లో జమ కాని డబ్బులు.. మూడో విడత ఆసరా విడుదల కార్యక్రమంలో భాగంగా స్వయం సహకార సంఘాలకు ఇచ్చాం అని చెప్పిన రూ.6,419 కోట్ల రూపాయలలో ఇంకా చాలా మంది లబ్దిదారుల ఖాతాల్లో జమ కాలేదు. సీఎం జగన్‌ బటన్‌ నొక్కగానే ఖాతాల్లో డబ్బులు పడతాయని భావించిన లబ్దిదారులు ఎప్పుడు జమవుతాయా.. అన్నట్లు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి 3వ విడత ఆసరా సొమ్ము ఏప్రిల్ 5 కల్లా లబ్దిదారులకు ఖాతాల్లో జమకావాల్సి ఉంది. కానీ, నెల గడిచి మే 5 వ తేదీ వచ్చినా ఆ సొమ్ము రాకపోవడంతో లబ్దిదారుల్లోని దాదాపు 40% మందికి నిరాశ ఎదురవుతోంది. ఇదే విషయం గుంటూరు జిల్లా ఫిరంగిపురానికి చెందిన మహిళలు స్పష్టం చేస్తున్నారు.

ఇంకా 73 వేల మందికి అందని ఆసరా.. సీఎం జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కిన రోజు చెప్పిన మాటల ప్రకారం.. గుంటూరు జిల్లాలోని 19,163 స్వయం సహాయ సంఘాల గ్రూపులకు రూ.163.71 కోట్లు రావాల్సి ఉంది. కానీ, 11,800 గ్రూపులకు రూ.90 కోట్లు నిధులు అందాయి. మిగతా 7,363 సంఘాల్లోని 73 వేల మందికి ఆసరా అందలేదు. దీంతో ఆ సంఘాల్లోని సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే సీఎం బటన్ నొక్కిన మార్చి 25వ నుంచి ఏప్రిల్‌ 5వ తేదీ వరకు ఆసరా మహోత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. ఇందులో పలువురు ఎమ్మెల్యేలు నమూనా చెక్కులు కూడా అందజేశారు. ఆసరా మహోత్సవాలను నిర్వహించిన తర్వాత DRDA- YSR క్రాంతి పథం అధికారులు ఆయా మండలా ల్లోని స్వయం సహయక సంఘాల బ్యాంకు ఖాతాల్లో ఆసరా సాయానికి సంబంధించి బిల్లులను అప్‌లోడ్‌ చేశారు.

అయితే.. ఆసరా సాయం అందకపోవటానికి నిధుల సమీకరణ సమస్యగా మారిందని సమాచారం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల నిధులను ఆయావర్గాల మహిళలకు కేటాయిస్తున్నారు. ఆ కార్పొరేషన్లలో నిధులు పరిమితంగా ఉండటంతో సర్దుబాటు చేయడం ఇబ్బందిగా మారింది. రంజాన్‌‌కు ముందు మైనారిటి కార్పొరేషన్‌ నుంచి నిధులు కేటాయించడంతో ముస్లిం SHG మహిళల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేశారు. ఓసీ సామాజిక వర్గాలకు చెందిన సంఘాలకైతే అసలు నిధులే జమ కాలేదు. వీరికి నిధులను సమకూర్చడంలో సమస్యలు ఎదురు అవుతున్నాయి. దీంతో లబ్దిదారులు DRDA- YSR క్రాంతి పథం కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. బటన్‌ నొక్కి నెల రోజులు దాటినా డబ్బులు రాకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అధికారులపై మహిళలు ఆగ్రహం..ప్రకాశం జిల్లాలో 36వేల సంఘాల్లో దాదాపు 3.59 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. వారికి మూడో విడత రూ. 280 కోట్లు విడుదల కావాల్సి ఉంది. ఇందులో కొంతమేరకు నిధులు జమైనా.. దాదాపు 50% పైగా సంఘాల ఖాతాల్లో ఆసరా డబ్బులు జమ కాలేదు. దీనిపై అధికారులను అడిగితే ఖాతా జమ అయినట్లు జాబితాలు చూపిస్తున్నారు. అదే బ్యాంకుకు వెళ్లి అడిగితే ఖాతాల్లో ఇంకా డబ్బు పడలేదని చెబుతున్నారు. అధికారుల మాటలకు... బ్యాంకు వారి మాటలకు పొంతన లేకపోనడంతో లబ్దిదారులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని డ్వాక్రా సంఘాల ఖాతాల్లో డబ్బులు జమచేసి మిగిలిన సంఘాలకు జమచేయక పోవడంపై మహిళలు మండిపడుతున్నారు.

పిల్లల పెళ్లిల కోసమో.. లేక చదువు కోసమో.. లేదంటే తమ కాళ్ల మీద తాము నిలబడటానికి వ్యాపారం బాట పట్టిన మహిళలకు సమయానికి డబ్బులు అందక అపసోపాలు పడుతున్నారు. మార్చి నెలలో రావాల్సిన డబ్బులు మే నెల వచ్చినా అందకపోవడంపై లబ్దిదారులు అవస్థలు పడుతున్నారు. అధికారులను అడిగితే జియో టాగ్‌ కావాలి అంటున్నారని విశాఖ మహానగర పాలక సంస్థ పరిధిలోని డ్వాక్రా మహిళలు, మహిళా సంఘాల లీడర్లు చెబుతున్నారు. విశాఖ.. 8జోన్లలోని 98 వార్డుల్లో ఇదే పరిస్థితి నెలకొందని లబ్దిదారులు ఆవేదన చెందుతున్నారు.

పనులు మానుకొని వెళ్లిన ఫలితం శూన్యం..ఇదిలా ఉంటే.. మార్చి 25వ నుంచి ఏప్రిల్‌ 5వ తేదీ వరకు మండల స్థాయుల్లో నిర్వహించిన ఆసరా మహాత్సల కార్యక్రమాలకు హాజరైతేనే బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తామని చెప్పారని.. దాంతో పనులు మానుకొని వెళ్లామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు డ్వాక్రా మార్ట్‌లలో సరకులు కొనాలని నిబంధన పెట్టారు. ఇలా ఆసరా పథకం అందాలంటే ఎన్నో షరతులు పెట్టారని.. ఆ మేరకు నడుచుకున్నా నిధులు మాత్రం జమవడం లేదని వాపోతున్నారు. ఇలా ఎన్నో రకాలుగా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని ఇబ్బందులకు గురిచేస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల ముందు జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి సరిగ్గా అమలు కావడం లేదని అంటున్నారు.

ఆసరా డబ్బులు అందని విషయం నిజమే.. చివరగా మహిళా సంఘాలకు ఆసరా డబ్బులు అందని విషయం నిజమేనని అధికారులు అంగీకరించారు. గుంటూరు జిల్లాలో చాలా వరకు స్వయం సహకార సంఘాలకు వైఎస్సార్ ఆసరా సాయం అందిందని.. మరికొన్ని సంఘాలకు త్వరలోనే జమ చేస్తామని అధికారులు చెబుతున్నారు. సకాలంలో డబ్బు అందక పోవకడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్న లబ్దిదారులు ఎప్పుడెప్పుడు సాయం చేస్తారా.. అని ఎదురుచూస్తున్నారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details