69 Bridges Incomplete Under R and B :ప్రాధాన్య రంగాల్లో అభివృద్ధి పనులకు ఎక్కడా నిధుల లోటు రాకుండా, చెల్లింపుల సమస్య లేకుండా చూస్తూ. ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు పూర్తి చేస్తున్నాం. గతేడాది జూన్ 21న రహదారులపై సమీక్ష సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలివి. సీఎం చెప్పేది వింటే రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని, పనులన్నీ పూర్తవుతాయనే భ్రమ కలగడం ఖాయం.
Construction Works Delay on R and B Bridges in State :రాష్ట్రంలో వైసీపీ అధికారం చేపట్టిన నాటి నుంటి ఆర్ అండ్ బీ వంతెనల పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. కొత్తవాటి సంగతి అటుంచి, పనులు మధ్యలో ఆగిపోయిన వాటికి నిధులిస్తే వాటినైనా పూర్తి చేస్తామని అధికారులు మొత్తుకుంటున్నారు. 175 కోట్ల రూపాయలు కేటాయిస్తే అసంపూర్తిగా ఉన్న 27 వంతెనల నిర్మాణం వెంటనే పూర్తవుతుందని ప్రజల కష్టాలు తీరతాయని తెలిసినా.. నిధులిచ్చేందుకు సీఎంకి మనసు రావటం లేదు. జనానికి ఇవేమీ తెలియవనే ఉద్దేశంతోనే నిధుల లోటు లేకుండా పనులు పూర్తి చేస్తున్నామంటూ వారిని మభ్యపెడుతున్నారు.
Bridge Collapse: నిర్వహణ లోపం.. కుప్పకూలే దుస్థితికి చేరుకున్న పురాతన వంతెనలు..
రాష్ట్రంలో కొత్త రహదారుల నిర్మాణం, విస్తరణ ఊసే లేదు. కనీసం పనులాగిపోయిన వంతెనల నిర్మాణం పూర్తి చేయాలన్న ధ్యాసే లేదు. జనం ఎన్ని కష్టాలు పడితే మాకేంటి? నిధులిచ్చేదే లేదు అనేలా జగన్ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది. ఆర్ అండ్ బీ పరిధిలోని జిల్లా, రాష్ట్ర రహదారుల్లో అసంపూర్తిగా ఉన్న వంతెనలు 60 ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వీటిని పూర్తి చేసేందుకు 734 కోట్ల రూపాయలు అవసరమని లెక్క తేల్చారు.
కొన్నాళ్ల కిందట వీటిపై ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు సమీక్ష చేసి, వెంటనే పూర్తి చేయాల్సిన వంతెనలు.. నిధులెంత అవసరమో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. హమ్మయ్య ఇప్పటికైనా నిధులొస్తాయన్న ఆశతో 27 వంతెనల వివరాలతో జాబితా తయారు చేశారు. వీటి అంచనా విలువ 295 కోట్లు కాగా, ఇంకా 175 కోట్లు చెల్లిస్తే ఈ ఏడాది చివరికి పూర్తి చేస్తామని నివేదికలందజేశారు. నెలలు గడిచినా.. సీఎంవో అధికారులుగానీ, ఆర్ధికశాఖ నుంచి గానీ ఎలాంటి స్పందనా లేదు. ఏదో హడావుడిగా నివేదిక అడిగారేగాని, నిధులిచ్చే ఉద్దేశం సీఎం జగన్‌కు లేదని స్పష్టమైపోయింది.