పండగకు దూరమైన అక్కచెల్లెమ్మలు - కొనసాగుతున్న అంగన్వాడీల ఆందోళన 35th Day of Anganwaadi Protest: కనీస వేతనం 26వేల రూపాయలకు పెంచి, జీవో నంబర్ రెండు రద్దు చేయాలని కోరుతూ ఆంగన్వాడీలు చేస్తున్న ఆందోళనలు పండుగవేళా కొనసాగుతున్నాయి. 35 రోజులుగా దీక్షా శిబిరాల వద్దే గడుపుతూ అంగన్వాడీలు చేస్తున్న ఆందోళనలు 35వ రోజుకు చేరుకున్నాయి. 35 రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని దీక్షా శిబిరం వద్ద కార్యకర్తలు ముగ్గులు వేసి, కోలాటాలు ఆడుతూ నిరసన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ఉక్కు పాదం మోపినా సమ్మె పట్టు సడలించేది లేదు- అంగన్వాడీలు
Protest in Guntur: న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ గుంటూరు జిల్లా మంగళగిరిలో ముగ్గులు వేసి అంగన్వాడీ కార్యకర్తలు నిరసన తెలిపారు.35 రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం కనీసం స్పందించటం లేదని మండిపడ్డారు. అంగన్వాడీలు ఎస్మా పరిధిలోకి రారనే విషయం తెలియకుండా సజ్జల మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కోట్లు ఖర్చు పెట్టి సినిమా సెట్టింగులు వేసి పండుగ చేసుకుంటూ మమ్మల్ని రోడ్డుపై నిల్చోపెట్టారని ఆవేదన వెలిబుచ్చారు. ప్రభుత్వ పెద్దలు సంక్రాంతి వేళ పంచభక్ష పరమాన్నాలు తింటుంటే తాము గంజి తాగాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని శిబిరం వద్దనే కార్యకర్తలు, ఆయాలు పాల పొంగలి తయారుచేసి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే జీతాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, గ్రాట్యుటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అంగన్వాడీల అలుపెరగని పోరాటం - డిమాండ్లు నేరవేర్చాలని డిమాండ్
Ongole: ఒంగోలు కలెక్టరేట్ ఎదుట డిమాండ్ల పరిష్కారం కోసం అంగన్వాడీ సిబ్బంది నిరాహార దీక్ష చేపట్టారు. ఎస్మా చట్టాన్ని తెచ్చి అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 35 రోజులుగా ఆందోళనలు చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకుండా కాలయాపన చేస్తుందని అంగన్వాడీలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమను చర్చలకు పిలిచి సానుకూలంగా సహకరించాలని లేకపోతే సమ్మె ఉద్ధృతంచేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
బెదిరింపులకు పాల్పడినా సమ్మె విరమించం - స్పష్టం చేసిన అంగన్వాడీలు
East Godavari: తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో అంగన్వాడీలు ముగ్గులు పెట్టి నిరసన వ్యక్తం చేశారు. భగభగ మండే సూర్యుని చూడు అంగన్వాడీలు సత్తా చూడు అంటూ అంగ్వాడీలు నినాదాలతో హోరెత్తించారు. పండగ వేళ ప్రజలను రోడ్డుపాలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌కే దక్కుతుందని కర్నూలు జిల్లాలో అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారించాలంటూ అంగన్వాడీలు చేపట్టిన సమ్మె కర్నూల్లో 33వ రోజుకు చేరుకుంది. ప్రతిపక్షంలో అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చింది సీఎం జగన్ అయితే చర్చలకు రమ్మని పిలవడానికి మధ్యలో సజ్జల రామకృష్ణా రెడ్డి ఎవరని నిలదీశారు.
Eluru: ఏలూరు కలెక్టరేట్ అంగన్వాడీల చేస్తున్న ఆందోళనలకు టీడీపీ నేత మాగంటి బాబు మద్దతు పలికారు. ఉద్యమ నిధి కోసం రూ.15 వేలు విరాళంగా ఇచ్చారు. సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తుంటే జగన్ మౌనం వహించటంపై మాగంటి అసహనం వ్యక్తం చేశారు.