ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అగ్రిగోల్డ్ బాధితులకు బడ్జెట్​లో రూ.3 వేల కోట్లు కేటాయించాలి' - ముప్పాళ్ళ నాగేశ్వరరావు లేటెస్ట్ న్యూస్

AGRIGOLD SATYAGRAHA DEEKSHA: రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలంటూ.. బాధితుల సంఘం ఎన్టీఆర్ జిల్లాలోని విజవాడలో రెండు రోజుల సత్యాగ్రహ దీక్ష చేపట్టింది. బడ్జెట్లో రూ.3 వేల కోట్లు తమకు కేటాయించాలంటూ డిమాండ్ చేసింది. వారి సమస్యలు పరిష్కారం కాకుంటే ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు.

నిరాహార దీక్షలు చేపట్టిన అగ్రిగోల్డ్ బాధితులు
నిరాహార దీక్షలు చేపట్టిన అగ్రిగోల్డ్ బాధితులు

By

Published : Mar 15, 2023, 5:04 PM IST

AGRIGOLD SATYAGRAHA DEEKSHA: రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి నాలుగేళ్లయినా అది అమలు కాలేదని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు తక్షణమే పూర్తి డిపాజిట్లను చెల్లించేలా.. బడ్జెట్​లో రూ.3 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ ధర్నా చౌక్​లో అగ్రిగోల్డ్ బాధితులు రెండు రోజుల సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. అగ్రిగోల్డ్ కేసులను ప్రత్యేకంగా ఏలూరులో కోర్టులో రోజువారి విచారణ చేపట్టి త్వరగా పరిష్కరించాలని ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు.

చనిపోయిన అగ్రిగోల్డ్ బాధితులకు రూ.10 లక్షలు ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక పూచిక పుల్లయినా ఇచ్చారా? అని ప్రశ్నించారు. కంపెనీకి చెందిన వేల కోట్ల రూపాయల ఆస్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసి.. ఆ నిధులను బడ్జెట్లో కేటాయించి బాధితులకు చెల్లింపులు చేసేలా రూ.3 వేల కోట్లను కేటాయించాలన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు చెల్లించాలన్నారు. సమస్యలను పరిష్కరించకుంటే ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు.

ఎనిమిది సంవత్సరాలుగా అగ్రిగోల్డ్ కంపెనీ చేసిన మోసానికి మా బాధితుల సంఘం పోరాడుతుందని ముప్పాళ్ల అన్నారు. ఈ పోరాటంలో మేము అద్భుతమైన విజయాలు సాధించినప్పటికీ.. ఏపీలో మాత్రం ఉన్న 11 లక్షలకు పైగా బాధితులకు రూ.3 వేల కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికి 10,40,000 మంది బాధితుల్లో రూ.20,000 లోపు ఉన్న వారికి రూ.906 కోట్లను సాధించగలిగాం. అలాగే ఎనిమిది రాష్ట్రాల్లో ఉన్న మొత్తం 32,00,000 మంది బాధితులకు అగ్రిగోల్డ్ కంపెనీ యాజమాన్యం ఆస్థులు మొత్తాన్ని అమ్మించైనా నగదును చెల్లించే బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని ఆయన అన్నారు.

నిరాహార దీక్షలు చేపట్టిన అగ్రిగోల్డ్ బాధితులు

"ఎన్నికల ముందు పాదయాత్రలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగేనే అగ్రిగోల్డ్ కంపెనీ యాజమాన్యం ఆస్తులను అమ్మించైనా బాధితులకు న్యాయం చేస్తానని చెప్పారు. ఈ లోపు ఒక్క బాధితుడు కూడా చనిపోకుండా వారం రోజుల్లో రూ.1,182 కోట్లు కేటాయించి రూ. 20 వేల లోపు బాధితులకు ఇస్తానని సీఎం చెప్పారు. చనిపోయిన వారికి చంద్రబాబు రూ.3 లక్షలు కేటాయిస్తే.. నేను వాటికి మరో రూ.7 లక్షలు అధికారంలోకి రాగానే రూ.10 లక్షలు ఇస్తానని అన్నారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపు అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తానని సీఎం తెలిపారు. అయితే ఇప్పటికీ మాకు న్యాయం చేయలేదు. అధికారులు వెంటనే స్పందించి అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలి" - ముప్పాళ్ల నాగేశ్వరరావు, అగ్రిగోల్డ్ బాధితుల సంఘం గౌరవాధ్యక్షుడు

ABOUT THE AUTHOR

...view details