POLITICAL WAR IN NANDYALA : రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంటోంది. ఎన్నికలకు సంవత్సరం పైగా సమయం ఉండగానే రాజకీయ నేతలు వారి మాటలతో వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. సవాళ్లు, ప్రతి సవాళ్లు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో మాటల యుద్ధానికి దిగుతున్నారు. తాజాగా నంద్యాలలో టెన్షన్ వాతావరణం నడుస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి, టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మినీ వార్ నడుస్తోంది.
నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తున్నారని తెలుగు దేశం పార్టీ నేత, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కుటుంబంపై చేసిన విమర్శలకు ఆధారాలు చూపాలని ఆమె డిమాండ్ చేశారు. ఆళ్లగడ్డలో అవగాహన లేని ఓ వ్యక్తి చెబితే మీడియా సమావేశాలు పెట్టి విమర్శిస్తున్నారన్నారని మండిపడ్డారు. శిల్పా కుటుంబం చేసిన ఆక్రమాలు సాక్షాధారలతో..సహా ఉన్నాయని.. శిల్పా కుటుంబం నుంచి నష్టపోయిన రైతులతో ధర్నా కార్యక్రమం చేపడతామన్నారు.
"నంద్యాల ఎమ్మెల్యే, మా మధ్యన జరిగే డిస్కషన్స్, హౌస్ అరెస్టులు అన్ని మీడియా ద్వారా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. వాస్తవాలు నిరూపించండి. మేము లీజ్‌కి తీసుకున్నామని చెప్పి మాట్లాడారు. మేము బలవంతంగా 200 ఎకరాలు తీసుకున్నామని ఆధారాలు ఉన్నాయా.. లేవు. కానీ అదే భూములు తీసుకుని మీరు రియల్ ఎస్టేట్ చేశారు. మీ నుంచి నష్టపోయిన రైతులతో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడుతాం"-భూమా అఖిల ప్రియ, మాజీ మంత్రి