Governor interact with Tribals: గిరిజనులు, గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. అవకాశాలను గిరిజన యువత సద్వినియోగం చేసుకుని దేశ సేవకు, జాతి అభ్యున్నతికి పాటు పడాలన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి సడక్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో వెచ్చించి అభివృద్ధి చేయాలని సూచించారు. ప్రత్యేక సాంప్రదాయ జీవన శైలి కలిగి ఉన్న గిరిజనుల గౌరవించాలని ఆయన తెలిపారు.
నంద్యాల జిల్లా పాణ్యం మండలం నెరవాడ గ్రామ గిరిజన గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన గిరిజనులతో ముఖాముఖి కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజన మహిళలు గవర్నర్తో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు రాజన్న దొర, అంజాద్ బాష ఎంపీ, ఎమ్మెల్యేలు, కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గిరిజన మహిళలకు రూ.4.30 కోట్ల విలువైన చెక్కును గవర్నర్ అందజేశారు.