New Born Baby Found In Dustbin : తొమ్మిది నెలలు మోసి జన్మనిచ్చిన ఆ తల్లికి.. కడుపు తీపి గుర్తుకు రాలేదేమో..! ముద్దు లొలికే ఆ పాపాయిని వదిలి వెళ్లేందుకు. ఆ చిట్టి ప్రాణాన్ని భూమ్మీదకు తీసుకు వచ్చేందుకు పడ్డ పురిటి నొప్పులు మరిచి పోయిందేమో..! పేగు బంధాన్ని వదిలి పెట్టేసింది ఆ తల్లి. కష్టమే వచ్చిందో, భారమని భావించిందో..! ఆడపిల్ల అని వదిలించుకున్నారో తెలియదు కానీ... అప్పుడే పుట్టిన పసికందును చెత్తకుప్పలో వదిలి వెళ్లారు. నంద్యాల జిల్లాలో జరిగిన ఈ అమానవీయ ఘటనకు సంబంధించి వివరాలివీ..
ఆడ శిశువువదిలేసిన తల్లిదండ్రులు :నంద్యాల జిల్లా బేతంచెర్లలో దారుణం చోటు చేసుకుంది. బేతంచెర్ల ప్రభుత్వ ఆస్పత్రి గేటు వద్ద చెత్త కుప్పలో బుధవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు ఆడ శిశువును వదిలి వెళ్లారు. అటుగా వెళుతున్న వారు శిశువును గమనించి హాస్పిటల్ సిబ్బందికి సమాచారం అందించారు. చిన్న పిల్లల వైద్యుడు రవి కుమార్కు సమాచారం తెలియజేశారు. వైద్యాధికారులు ఆ శిశువును తీసుకుని వైద్య పరీక్షలు చేసి.. ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ అధికారులు ఆస్పత్రికి చేరుకుని శిశువును చేతుల్లోకి తీసుకున్నారు. బాలల సంరక్షణ కేంద్రానికి అప్పగిస్తామని బనగానపల్లి సీడీపీఓ ఉమా మహేశ్వరమ్మ తెలిపారు.