ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పరువు హత్య: తల్లి లేని లోటు లేకుండా పెంచి, పెళ్లి చేశాడు..! అయినా, వేరొకరితో.. - నంద్యాల జిల్లా తాజా వార్తలు

Daughter killed by father : తన ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పుకొందామంటే ఆ యువతికి తల్లి లేదు. అప్పటికే ఆమె కన్ను మూయడం... తండ్రి అంటే భయం కొద్దీ దాచేసింది. మరోవైపు తల్లి లేని లోటు ఏ మాత్రం రానివ్వకుండా కూతురి పెళ్లి ఘనంగా చేయాలన్నది ఆ తండ్రి ఆలోచన. మంచి సంబంధం చూసి పెళ్లిచేసి అత్తారింటికి పంపించేశాడు. కానీ, పెళ్లయినా తను ప్రేమించిన యువకుడిని మర్చిపోలేకపోయింది ఆ యువతి. భర్తను వదిలేసి గ్రామానికి తిరిగొచ్చేసింది. తను ప్రేమించిన యువకుడితో వెళ్లిపోయింది. విషయం తెలిసిన తండ్రిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పలుచోట్ల వెతికి ఇద్దరిని పట్టుకుని వచ్చి పెద్ద మనుషుల్లో పంచాయితీ పెట్టించాడు. అయినా ఆ యువతి ససేమిరా అనడంతో కడతేర్చాడు.

Etv Bharat
Etv Bharat

By

Published : Feb 25, 2023, 9:15 AM IST

Daughter killed by father : నంద్యాల జిల్లా పాణ్యం మండలం ఆలమూరు గ్రామానికి చెందిన దేవేందర్ రెడ్డికి ఇద్దరు కూతుళ్లు.. పెద్ద కూతురుకు మంచి సంబంధం చూసి పెళ్లిచేసి పంపించేశాడు. అల్లుడు, కూతురు హైదరాబాద్ లో సంతోషంగా ఉంటున్నారనుకుంటున్న తరుణంలో.. ఉన్నట్టుండి కూతురు ఇంటికి తిరిగొచ్చింది. కొద్ది రోజులకే గ్రామానికి చెందిన మరో యువకుడితో వెళ్లిపోయింది. ఇద్దరినీ పట్టుకుని పెద్దమనుషుల్లో పంచాయితీ పెట్టి విడదీశారు. కానీ కొద్ది రోజులకే ఆ యువతి తండ్రి చేతుల్లో కన్నుమూసింది.

రెండేళ్ల కిందట వివాహం... ఆలమూరు గ్రామానికి చెందిన దేవేందర్ రెడ్డికి ప్రసన్న, ప్రవళిక అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రసన్న కు రెండేళ్ల క్రితం బనగానపల్లె మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన యువకుడితో వివాహమైంది. భర్త సాఫ్ట్ వేర్ ఉద్యోగి కావడంతో హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. కాగా, పెళ్లికి ముందే ఓ యువకుడిని ప్రేమించిన ప్రసన్న.. కొద్దిరోజుల క్రితం అతడితో కలిసి పారిపోయింది. గ్రామస్తులు పోలీస్ స్టేషన్లో పంచాయితీ చేసి ఇద్దరినీ విడదీశారు.

కిరాతకంగా హతమార్చి.. భర్త దగ్గరికి వెళ్లాలని తండ్రి వేడుకున్నా... ప్రసన్న స్పందించడం లేదు. ఈ క్రమంలో కూతురు వ్యవహారాన్ని అవమానంగా భావించిన దేవేందర్ రెడ్డి.. ఈనెల 10వ తేదీన ప్రసన్నను గొంతు నులిమి చంపాడు. అనంతరం కొంతమందితో కలిసి మృతదేహాన్ని కారులో నంద్యాల -గిద్దలూరు రహదారిలో అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ప్రసన్న తల, మొండెం వేరు చేసి వేర్వేరుగా లోయల్లో పడేశాడు. తర్వాత ఇంటికి వచ్చి ఏమీ తెలియనట్లు ఉన్నాడు.

ఫోన్ రాక పోవడంతో... రెండు వారాలైనా మనవరాలు ఫోన్ చేయకపోవడంతో దేవేందర్ రెడ్డి తండ్రి శివారెడ్డి అనుమానించాడు. కొడుకుని పదేపదే అడిగాడు. చివరికి గట్టిగా నిలదీయడంతో కూతురును చంపిన విషయం దేవేందర్ రెడ్డి బయటకు చెప్పాడు. ఆ విషయాన్ని తట్టుకోలేని శివారెడ్డి.. పాణ్యం పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దేవేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకొన్న పోలీసులు.. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా రెండ్రోజుల పాటు లోయలో గాలించి కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ప్రసన్న మృతదేహాన్ని, తలను గుర్తించారు. శవపరీక్ష కోసం నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. శివారెడ్డి ఫిర్యాదు మేరకు దేవేందర్ రెడ్డి తో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సుధాకర్ రెడ్డి వివరించారు. ప్రసన్న తల్లి ఐదు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందడంతో దేవేందర్ రెడ్డి ఇటీవలే మరో వివాహం చేసుకున్నట్టు తెలిసింది.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details