Telangana Budget 2023: ఎన్నికల ఏడాదిలోకి అడుగుపెట్టిన తెలంగాణ ప్రభుత్వం.. ఆ కోణంలోనే రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను కూడా సిద్ధం చేయనుంది. ఈ ఏడాది కేసీఆర్ సర్కారు ప్రజా తీర్పు ఎదుర్కోవాల్సి ఉంది. ఈ తరుణంలో ఎన్నికల కోణంలోనే 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను రూపకల్పన చేయనున్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు మూడు త్రైమాసికాలు గడిచిపోయాయి. చివరి త్రైమాసికం మాత్రమే మిగిలి ఉంది. మొదటి తొమ్మిది నెలల ఆదాయం, రాబడులు, కేంద్రం నుంచి వచ్చిన నిధులు, వచ్చేందుకు అవకాశం ఉన్న మొత్తం, తదితరాలను బేరీజు వేసుకొని... రానున్న ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ కసరత్తు చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఆర్థికశాఖ త్వరలోనే కసరత్తు వేగవంతం చేయనుంది.
Telangana Budget 2023-24 : 2022-23 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం భారీ అంచనాతో రెండు లక్షలా 52 వేల కోట్ల రూపాయల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. లక్షా 26 వేల కోట్ల సొంత రాబడులు అంచనా వేయగా.. డిసెంబర్ చివరి నాటికి అంచనాలకు అనుగుణంగానే ఖజానాకు సమకూరాయి. 90 వేల కోట్లకుపైగా రాష్ట్ర ప్రభుత్వానికి సొంత ఆదాయం వచ్చింది. మిగిలిన మూడు నెలల్లోనూ ఇదే తరహాలో రాబడులు ఉంటాయని అంచనా వేస్తున్నారు.
వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, రవాణా పన్ను తదితరాల ద్వారా ఆశించిన ఆదాయం ఖజానాకు చేరుతుందని.. వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ వృద్ధిరేటు బాగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. 15 శాతానికిపైగా వృద్ధి ఉండవచ్చని భావిస్తున్నారు. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కూడా భారీగానే ఉండవచ్చని అంటున్నారు. పన్నేతర రాబడి కూడా పదివేల కోట్ల మార్కును దాటింది. భూముల వేలం తదితరాలు కొనసాగుతున్న తరుణంలో పన్నేతర రాబడి ఇంకా పెరుగుతుందని భావిస్తున్నారు.