MAHASHIVRATRI IN SRISAILAM: ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలంలో శనివారం నుంచి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. రెండో ఉత్సవాలకు భక్తులు భారీగా చేరుకుంటున్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో నల్లమల్ల అడవుల గుండా పాదయాత్ర చేస్తూ శ్రీశైలానికి చేరుకుంటున్నారు. శ్రీశైలంలో భక్తులందరికీ ఆలయ అధికారులు కావల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు సులువుగా మల్లికార్జున స్వామి వారి అలంకార దర్శనం జరిగేలా ఏర్పాట్లు చేశారు.
భక్తులు రూ.500 అతి శీఘ్ర దర్శనం, రూ. 200 శీఘ్ర దర్శనం టిక్కెట్లు తీసుకొని దర్శనం చేసుకుంటున్నారు. అతి శీఘ్ర దర్శనం గంట సమయం ,శీఘ్ర దర్శనం రెండున్నర గంటల సమయం , ఉచిత దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుంది. పాదయాత్ర చేసుకుంటూ వచ్చే భక్తులను శీఘ్ర దర్శనం క్యూ లైన్ లో దర్శనానికి అనుమతిస్తున్నారు. రాత్రి 7 గంటలకు శ్రీ స్వామి అమ్మవార్లకు బృంగి వాహన సేవ జరగనుంది. బృంగి వాహనంపై గ్రామోత్సవం నిర్వహించనున్నారు.