Mahashivratri celebrations in Srisailam: శ్రీశైలం మహా క్షేత్రం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. నేటి నుంచి ఈ నెల 21 వరకు శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఆలయ పురవీధుల్లో దేవతామూర్తుల విద్యుత్ అలంకరణ చేపట్టారు. ఈరోజు ఉదయం 8.46 గంటలకు ఆలయ ప్రాంగణంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ప్రారంభ పూజలకు దేవస్థానం చైర్మన్ రెడ్డి వారి చక్రపాణి రెడ్డి, ఈవో లవన్న, అర్చకులు , వేద పండితులు శ్రీకారం చుట్టునన్నారు. సాయంత్రం 7 గంటలకు ధ్వజారోహణ కార్యక్రమం నేత్ర శోభితంగా జరగనుంది.
లడ్డూ ప్రసాదాలు
బ్రహ్మోత్సవాల్లో మొత్తం 30 లక్షల లడ్డూలను తయారు చేసి భక్తులకు అందజేయనున్నారు. వీటి విక్రయాలకు 15 కౌంటర్లు ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఐదు అదనపు కౌంటర్లు ఏర్పాటు చేశారు. వీటిలో మహిళలు, దివ్యాంగుల కోసం మూడు కౌంటర్లు కేటాయించారు. రోజుకు 2 లక్షలకు పైగా లడ్డూలను తయారు చేసి నిల్వ కేంద్రానికి తరలిస్తారు.
19 ఎకరాల్లో పార్కింగ్
బ్రహ్మోత్సవాలకు వచ్చే బస్సులు, కార్ల వంటి వాహనాలను పార్కింగ్ ప్రదేశాలకు మళ్లిస్తారు. క్షేత్రంలో మొత్తం 19 ఎకరాల్లో పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఆగమ పాఠశాల ఎదుట, యజ్ఞవాటిక, వాసవీ విహార్ ప్రదేశాల్లో పార్కింగ్ సదుపాయం సిద్ధం చేశారు. ఆయా ప్రదేశాల్లో విద్యుద్దీపాలు, మరుగుదొడ్ల వసతి కల్పించారు. పార్కింగ్ ప్రదేశాల నుంచి క్షేత్రంలోకి వచ్చేందుకు ఆటోలను వినియోగించుకోవచ్చు
మరుగుదొడ్లు.. స్నానపు గదులు
క్షేత్ర పరిధిలో పలుచోట్ల భక్తుల సౌకర్యార్థం 149 స్నానపు గదులు, 36 మూత్రశాలలు, 346 మరుగుదొడ్లు అందుబాటులో ఉన్నాయి. టూరిస్ట్ బస్టాండ్, నీలకంఠేశ్వర డార్మెటరీ, కరివేన సత్రం పక్కన స్నానపుగదులు ఏర్పాటు చేశారు.