Protest To Buggana: పండగ వాతావరణం వేళ వారి జీవితాల్లో చీకటి అలుముకుంది. బయటకు వెళ్లిన తమ కుమారులు వస్తారని తమ చేతులతో చేసిన పిండి వంటలు తింటారనీ వారు వెయ్యి కళ్లతో ఎదురు చూశారు. కానీ వారి రాకపోగా.. వారి చావు వార్త విని అందరూ ఒక్కసారిగా కుదేలైయారు. ఈ ఘటన నంద్యాల జిల్లాలో జరిగింది. పండుగ పూట జాతీయ రహదారి దాటుతుండగా వాహనం ఢీకొని ముగ్గురు చనిపోయారు. ఈ వార్త తెలుసుకుని బాధిత కుటుంబాళను పరామర్శించడానికి వెళ్లిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌కు చుక్కెదురైంది. బాధిత కుటుంబ సభ్యులు మంత్రిని అడ్డుకున్నారు.
ఐచర్ ఢీకొని..ముగ్గురు మృతి: నంద్యాల జిల్లా డోన్ మండలం దొరపల్లి గ్రామంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌కు నిరసన సెగ తగిలింది. గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు జాతీయ రహదారి దాటుతుండగా ఐచర్ ఢీకొని మృతి చెందారు. మృతుల కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన మంత్రిని గ్రామస్థులు అడ్డగించారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో గ్రామ ప్రజలు మంత్రిపై ఆగ్రహానికి లోనయ్యారు. గ్రామానికి ప్రత్యామ్నాయ రహదారి చూపాలంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసుల బలగాలతో గ్రామస్థులను చేదరగొట్టే ప్రయత్నం చేశారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ముందు కూర్చోని ఆందోళనకు దిగారు. రైల్వే అధికారులతో మాట్లాడి చెప్తానని మృతుల కుటుంబాలను పరామర్శించకుండానే.. సమాధానం చెప్పలేక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెనుతిరిగారు.