Problems of small traders: నంద్యాల జిల్లా కేంద్రంలో ఫుట్ పాత్ లపై వివిధ రకాల వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగించే కుటుంబాలు సుమారు 6 వేల వరకు ఉన్నాయని ఓ అంచనా. రద్దీ ప్రాంతాల్లో, ప్రజలు ఎక్కువగా తిరిగే కూడళ్లలో పూలు, పండ్లు సహా చిన్న చిన్న వస్తువులు అమ్ముకుంటూ వీరంతా జీవనం సాగిస్తున్నారు. తోపుడు బండ్లు, చిన్న చిన్న రేకులు వేసుకుని ఎవరికీ ఇబ్బంది లేకుండా వీరంతా ఎన్నో ఏళ్లుగా చిరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఒక్కో బండి వద్ద సరాసరిన ముగ్గురు పని చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా డ్రైనేజీ సమస్యలు ఏర్పడుతున్నాయని వాటిపై జీవనం సాగించే దుకాణాలను, తోపుడు బండ్లను మున్సిపల్ అధికారులు తొలగిస్తున్నారు. కనీసం ఏమాత్రం సమయం ఇవ్వటం లేదు. రోడ్డుపై పెట్టుకుందామంటే పోలీసులు ఒప్పుకోవటం లేదు. దీంతో వ్యాపారాలు ఎక్కడ చేసుకోవాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొందని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
శ్రీనివాస సర్కిల్, గాంధీ చౌక్, మున్సిపల్ కార్యాలయం, బస్టాండ్ ప్రాంతం సహా ఇతర కూడళ్లలో డ్రైనేజీలపై నిర్మాణాలను తొలగిస్తున్నారు. వాటిపై ఏర్పాటు చేసుకున్న దుకాణాలను విచక్షణా రహితంగా ధ్వంసం చేస్తున్నారు. ఏవరైనా నిలదీస్తే బెదిరిస్తున్నారని చిరు వ్యాపారులు చెబుతున్నారు. రహదారుల పక్కన వ్యాపారాలు చేసుకోవచ్చని గతంలో సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. 2014లో పార్లమెంటు చట్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సైతం గుర్తింపు కార్డులు ఇచ్చింది. బ్యాంకులు వీరికి రుణాలు ఇచ్చాయి. ఒకవేళ దుకాణాలు తొలగించాల్సి వస్తే మొదట నోటీసులు ఇవ్వాలి. వాటికి స్పందించకపోతే... అప్పుడు తొలగించవచ్చు. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి సైతం తమకు సహాయం చేయటం లేదని చిరు వర్తకులు ఆరోపిస్తున్నారు.