Nandigama Government Hospital: రాజకీయ నాయకులు ఇచ్చే హామీలు.. నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయనే దానికి నిదర్శనం ఎన్టీఆర్ జిల్లా నందిగామ ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి. 100 పడకల ఆసుపత్రిగా మారుస్తామని.. ఎన్నికల ముందు హామీలిచ్చిన నేతలు.. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా దాన్ని పట్టించుకునే వారే లేరు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని కూడా విజయవాడ, గుంటూరు తీసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ నిర్వహణలో నడుస్తున్న దేవినేని వెంకటరమణ సామాజిక ఆరోగ్య కేంద్రం దగ్గర్లోనే ఉన్నా.. సౌకర్యాల కొరత వల్ల ప్రజలకు నిరుపయోగంగా మారింది. చుట్టు పక్కల గ్రామాల నుంచి నిత్యం వందలాది మంది రోగులు ఇక్కడికి వస్తుంంటారు. కానీ, ఇక్కడ సరైన వైద్యం అందకపోవడంతో వారు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. వారిని ఈ ఆసుపత్రికి తరలిస్తే.. వైద్యులు, పరికరాలు లేక ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం విజయవాడ, గుంటూరు ఆసుపత్రులకు పంపిస్తున్నారు. ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలించేటప్పుడు చాలా మంది ప్రాణాలు కోల్పోయారంటూ.. స్థానికులు చెబుతున్నారు.