Nara Lokesh Comments On YS Jagan: వైసీపీ ప్రభుత్వంలో నకిలీ విత్తనాలతో పత్తి రైతులు ఆవేదన చెందుతున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెల్లడించారు. 1,200 కిలోమీటర్ల పాదయాత్ర సందర్భంగా.. నంద్యాల జిల్లా, నందికొట్కూరు నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో నారా లోకేశ్ మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీసిన రైతులపై దొంగ కేసులు పెడుతున్నారని లోకేశ్ ఆరోపించారు. మోటర్లకు మీటర్లు బిగించడంపై స్పందించిన లోకేశ్.. మోటార్లకు మీటర్లతో రైతులకు ఉరితాడులా మారిందని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వంలో డ్రిప్ ఇరిగేషన్ రాయితీ ఎత్తివేశారని మండిపడ్డారు.
జగన్ పాలనలో దళితులు అవమానాలు: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దళితుల కోసం తీసుకువచ్చిన 27 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారని విమర్శించారు. జగన్ పాలనలో దళితులు అవమానాలకు గురవుతున్నారని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో దళితులు బాధితులుగా మారారని లోకేశ్ వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే నిలిచిన సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభిస్తామని లోకేశ్ వెల్లడించారు. మైనార్టీలను సైతం వైసీపీ నేతలు వదలలేదని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన మెుదటి సంవత్సరంలోనే ఇస్లాం బ్యాంక్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పౌరసరఫరల శాఖ మంత్రి వ్యాఖలపై లోకేశ్ వ్యంగంగా స్పందించారు. మంత్రి రైతులను అవమానించినందుకు క్షమాపణ చెప్పాలని లోకేశ్ డిమాండ్ చేశారు.