Nandyala People Suffering With Industrial Pollution :జిల్లా కేంద్రమైన తర్వాత మరిన్ని వసతులతో వెలుగొందాల్సిన నంద్యాల పరిశ్రమల కాలుష్యంతో కొట్టుమిట్టాడుతోంది. పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థ జలాలు పంట పొలాల్లోకి చేరి పాడైపోతున్నాయి. కాలుష్య నియంత్రణ అధికారులు చోద్యం చూస్తున్నారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
Industrial Pollution in Nandyal Town :నంద్యాలలోని పరిశ్రమలు కాలుష్యానికి నిలయాలుగా మారాయి.నంద్యాల సమీపంలోని నూనెపల్లె, రైతునగరం, అయ్యలూరు మెట్ట, చాబోలు, కానాల గ్రామాల పరిధిలో 11 పత్తి, 16 వరి విత్తన శుద్ధి కర్మాగారాలు ఉన్నాయి. మరోవైపు పట్టణ శివారుల్లో విజయ డైరీ, ఎస్పీవై రెడ్డి ఫ్యాక్టరీలు ఉన్నాయి. వీటి నుంచి భారీగా వచ్చే కలుషిత జలాలు వాగులు, వంకల్లో చేరి,అక్కడి నుంచి కుందూ నదిలో కలుస్తున్నాయి. కుందూనది నీటిపై ఆధారపడి పంటలు పండించే వేలాది ఎకరాల్లో ఈ కలుషిత నీరు చేరి పంటలపై తీవ్ర ప్రభావం చూపుతోందని రైతుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Crop Fields Damage With Industrial Waste in Nandyal Town :అక్టోబర్ మాసంలో వరి, పత్తి విత్తనాల శుద్ధి ప్రక్రియ ప్రారంభం అవుతుంది. దీని కోసం సల్ఫ్యూరిక్ యాసిడ్, ఆల్కలైన్ లను వినియోగిస్తారు. ఈ వ్యర్థాలను ఫ్యాక్టరీల నుంచి బయటకు రాకుండా చూడాలి. కానీ దీనికి విరుద్ధంగా.. యథేచ్ఛగా నదుల్లో కలిపేస్తున్నారు. విజయ పాల డైరీ, ఎస్పీవై రెడ్డి ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థాలన్నింటినీ.. ఇష్టారాజ్యంగా కుందూ నదిలో కలుపుతున్నారు. ఈ నీరు పంటలకు వినియోగించటం వల్ల నేల స్వభావం దెబ్బతిని వరి, జొన్న, మిరప పంటల దిగుబడి తగ్గిపోతోంది. నేల కఠినంగా మారి భూసారం దెబ్బతింటోంది. మరోవైపు ఈ దుర్గంధం వల్ల శ్వాసకోశ సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఈ వ్యర్థాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.