CHALLA BHAGHEERATHA REDDY: చల్లా రామకృష్ణారెడ్డి కుమారుడు, నంద్యాల జిల్లా అవుకు ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి (46) అనారోగ్యంతో నేడు కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కొద్ది రోజులుగా కాలేయ సమస్యతో బాధపడుతున్న ఆయన.. మూడు రోజుల నుంచి తీవ్ర దగ్గుతో బాధపడటంతో చికిత్స కోసం కుటుంబసభ్యులు హైదరాబాద్ తరలించారు. ఊపిరితిత్తుల్లో రక్తస్రావం కావడంతో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
రేపు అవుకులో భగీరథరెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అంత్యక్రియలకు సీఎం జగన్ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. చల్లా భగీరథరెడ్డి భార్య శ్రీలక్ష్మి అవుకు జెడ్పీటీసీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. తండ్రి చల్లా రామకృష్ణారెడ్డి మరణంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ పదవిని.. కుమారుడికి ఇచ్చారు. 2021 మార్చి నుంచి భగీరథరెడ్డి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఆయన మరణంతో అవుకులో విషాదఛాయలు అలుముకున్నాయి.