పవన్ కల్యాణ్ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు: కొట్టు Minister Kottu Satyanarayana Comments on Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. శ్రీశైలం దర్శనానికి వచ్చిన మంత్రి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పవన్ కల్యాణ్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బీసీ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి కాపులను అవమానించే విధంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ దిగజారే విధానాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారని విమర్శించారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ఉన్నత విద్యను చదువుకునే కాలేజీ విద్యార్థులను పవన్ కల్యాణ్ రెచ్చగొడుతున్నారన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో బీసీలకు సామాజిక న్యాయం జరిగిందని, గణాంకాలతో సహా నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు మంత్రి సవాల్ విసిరారు. పవన్ కల్యాణ్‌కు సబ్జెక్టు, కంటెంట్ లేదని మంత్రి విమర్శించారు. రాజకీయ కుట్రలో భాగంగానే పవన్ కళ్యాణ్ బీసీ రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారన్నారు.
దేశంలో జగన్ మోహన్ రెడ్డి లాంటి సామాజిక న్యాయం చేసిన రాజకీయవేత్త ఎక్కడ లేరని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ విశ్లేషించారు. సామాజికంగా పదవులు కేటాయించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేయని సాహసాన్ని కూడా జగన్ చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఎలా ఎదుర్కోవాలో తెలియని అయోమయ స్థితిలో ప్రతిపక్షాలు ఉన్నాయని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.
రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధిస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. జగన్ పథకాల వల్ల రాష్ట్రం అప్పుల పాలవుతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు వస్తే.. జగన్ పథకాలు తీసేస్తారని చెబుతుండటం వల్ల ఈ ప్రచారాలు ఎవరికి ఉపయోగపడతాయో ప్రజలే నిర్ణయిస్తారన్నారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు జగన్ నాయకత్వంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని మంత్రి కొట్టు సత్యనారాయణ జోష్యం చెప్పారు.
"పవన్ కల్యాణ్ తాడేపల్లిలోని వాళ్ల పార్టీ ఆఫీస్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశం ఏర్పాటు చేయడం.. కాపుల మీద నిందలు వేయటం, కాపు ప్రజాప్రతినిధులపై నిందలు వేయటం అతనికి బాగా అలవాటు అయిపోయింది. కాపులను తిట్టడం బాగా అలవాటు అయిపోయింది. నేను ఏం చెప్తున్నా అంటే.. కాపులపై నిందలు వేయద్దు. కాపులు నీకు ఏం అన్యాయం చేశారని నువ్వు తిడుతున్నావు. పవన్ కల్యాణ్‌కి నేను చెప్పొచ్చేదేంటంటే.. నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి.. పిచ్చి పిచ్చి స్లోగన్స్‌ను ఈ కాలేజీ విద్యార్థులతో ఇప్పించి.. వారి జీవితాలతో దయచేసి ఆడుకోవద్దు. వాళ్ల భవిష్యత్తుతో ఆడుకోవద్దు. నీ కోసం వారి జీవితాన్ని పణంగా పెట్టొద్దని సలహా ఇస్తున్నాను. ఎందుకంటే ఇతనితో తిరిగే వాళ్లందరూ.. జగన్ మోహన్ రెడ్డి ఇచ్చే ఫీజు రీయంబర్స్‌మెంటుతో చదువుకుంటున్నారు. విద్యార్థులను టార్గెట్ చేసి పవన్ కల్యాణ్ వాళ్లని ఎంకరేజ్ చేస్తున్నారు. దీని వలన విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుంది". - కొట్టు సత్యనారాయణ, దేవాదాయ శాఖ మంత్రి
ఇవీ చదవండి: