Yuvagalam Padayatra: మహా పాదయాత్ర నిర్వహణ అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఏ రోజుకారోజు ప్రాంతం మారిపోతుంది. తర్వాత రోజు ఉండేందుకు అనువైన ప్రదేశం చూసుకోవాలి.. అక్కడ ఉండేందుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయం చేసుకోవాలి. వేలాదిగా పాల్గొనే అభిమానులకు మంచినీళ్లు, భోజనం ఇతర ఏర్పాట్లు పర్యవేక్షించుకోవాలి. పాదయాత్ర చేసే నాయకుడి భద్రత నుంచి వెనుక వరుసలో నిడిచే చివరి కార్యకర్త వరకూ ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా లక్ష్యం చేరే వరకూ పూర్తి అప్రమత్తంగా వ్యవహరించాలి. గత 77రోజులుగా పాదయాత్ర చేస్తున్న నారా లోకేశ్ యువగళాన్ని విజయవంతంగా ముందుకు నడిపించటంలో ఆ 14 విభాగాల సమన్వయమే ప్రధాన కారణం.
నారా లోకేశ్ యువగళం మహా పాదయాత్ర వెయ్యిరోజులు పూర్తిచేసుకోవటంలో తెరవెనుక 14 కమిటీల కృషి కీలకమనే చెప్పాలి. అధికార పార్టీ నుంచి ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. పోలీసులు లాఠీలు ఘుళిపించినా.. ఎళ్లవేలలా ఈ కమిటీలే వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చాయి. పాదయాత్ర 1000 కి.మీ మైలురాయి చేరుకున్న సందర్భంగా ఇప్పటివరకు తనకు వెన్నంటి నిలచిన యువగళం సైనికులను లోకేశ్ ప్రత్యేకంగా అభినందించారు. తన యాత్ర సజావుగా సాగేలా అహర్నిశలు పనిచేస్తున్నారని వారిని కొనియాడారు. లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. యువగళం ప్రధాన సమన్వయకర్త కిలారు రాజేష్ వ్యవహరిస్తుండగా.. ఈ కమిటీలు అనుక్షణం వెన్నంటి ఉండి సహకారం అందిస్తున్నాయి. వీరితోపాటు 100 మంది పసుపు సైనికులు వాలంటీర్లుగా వ్యవహరిస్తూ రేయింబవళ్లు పనిచేస్తున్నారు.