Maha Kumbhabhishekam in Srisailam: శ్రీశైలంలో మహా కుంభాభిషేకం, ఇతర కార్యక్రమాల నిర్వహణకు ముహూర్తం తిరిగి ఖరారు చేసే విషయంలో ‘సంప్రదింపుల ప్రక్రియను’ సాధ్యమైనంత త్వరగా.. గరిష్ఠంగా ఆరువారాలలో పూర్తి చేయాలని దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి, దేవాదాయ కమిషనర్, శ్రీ బ్రమరాంబ మల్లికార్జునస్వామి వారి దేవస్థానం ఈవోను హైకోర్టు ఆదేశించింది. ముహూర్తం తిరిగి ఖరారు విషయంలో ఇంతకు ముందు సంప్రదించిన వారితో పాటు కంచి కామకోటి పీఠం విజయేంద్ర సరస్వతి స్వామీజీ, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముగ శర్మ, వీర శైవ ఆగమ, స్మార్థ ఆగమానికి చెందిన ప్రముఖ పండితుల అభిప్రాయాలు.. సలహాలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
విచారణను ఆరు వారాలకు వాయిదా..మహా కుంభాభిషేకం కార్యక్రమంలో భక్తులు, ఆహ్వానితులు, ఇతర భాగస్వాములు ఎక్కువ సంఖ్యలో పాల్గొనేందుకు వీలుగా తిరిగి నిర్ణయించిన ముహూర్తం తేదీ వివరాలను ముందుగా తెలియజేస్తూ రాతపూర్వక ఉత్తర్వులును ఇవ్వాలని దేవాదాయ కమిషన్, శ్రీశైలం ఈవోను హైకోర్టు ఆదేశించింది. శుభ ముహూర్తం ఖరారుకు సంబంధించిన వివరాలను తదుపరి విచారణలోపు కోర్టు ముందు ఉంచాలని స్పష్టం చేసింది. విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి కృష్ణమోహన్, జస్టిస్ ఏవీ రవీంద్రబాబుతో కూడిన ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులు బుధవారం అందుబాటులోకి వచ్చింది.
దేవాదాయశాఖ కమిషనర్ ఏకపక్ష నిర్ణయంపై వ్యాజ్యం..శ్రీశైలంలో ఈ నెల 25 నుంచి 31 వరకు నిర్వహించతలపెట్టిన మహా కుంభాభిషేకం, లింగ, యంత్ర, కలశ ప్రతిష్ఠ కార్యక్రమాలను వాయిదా వేస్తూ దేవాదాయశాఖ కమిషనర్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారంటూ అఖిల భారత వీరశైవ ధార్మిక ఆగమ పరిషత్ ఛైర్మన్ సంగాల సాగర్ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం వేశారు. కమిషనర్ చర్యలు దేవాదాయ చట్టంలోని సెక్షన్ 13(1)ని ఉల్లంఘించడమేనన్నారు. ఈ నెల 23న ధర్మాసనం ఈ వ్యాజ్యంపై విచారణ జరిపింది.‘ఆగమ పండితులు, వైదిక కమిటీ, ఆస్థాన పండితులు, ఇతర పండితులు, శ్రీశైలం దేవస్థానం అర్చకులను సంప్రదించాక మహా కుంభాభిషేకం ముహూర్తాన్ని గతంలో నిర్ణయించారు. కమిషనర్ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు పత్రిక ప్రకటన జారీ చేశారు. పండితులను సంప్రదించి మళ్లీ ముహూర్తం నిర్ణయిస్తామని చెప్పారు.
కౌంటర్ దాఖలు చేశాక పరిశీలన..వాయిదా నిర్ణయం దేవాదాయ చట్టం సెక్షన్ 13(1)ను ఉల్లంఘించడమా? కాదా? అనే విషయాన్ని ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేశాక పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది. అత్యల్ప సమయం ఉన్న నేపథ్యంలో ఇది వరకు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం(25 నుంచి) కార్యక్రమం నిర్వహించడానికి అధికారులకు సాధ్యపడదని.. ఇప్పటికే కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు నిర్ణయం తీసుకున్నందున గతంలో నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మహా కుంభాభిషేకాన్ని నిర్వహించాలని ఈ దశలో ఆదేశించలేమని తెలిపింది. సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించి సాధ్యమైనంత త్వరగా ముహూర్తం తిరిగి ఖరారు చేయాలని ప్రతివాదులకు స్పష్టం చేస్తున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది.
ఇవీ చదవండి: