Catching fish in an innovative way: వారంతా మత్స్యకారులు. చేపలు పట్టటం వారి వృత్తి. కానీ.. అందరిలా పాత పద్ధతుల్లో కాకుండా.. వినూత్న రీతిలో చేపలు పడుతున్నారు. అతి సులువుగా చేపలు పడుతూ జీవనం సాగిస్తునన్నారు. చిన్న చేపనైనా పెద్ద వలతో పట్టేస్తుంటారు మత్స్యకారులు.! కానీ.. నంద్యాల జిల్లా పాణ్యం మండలం గోరుకల్లు జలాశయం వద్ద జాలరులు.. ఇంకా పెద్ద వలతో చేపలవేట సాగిస్తున్నారు. గోరుకల్లు జలాశయం నిర్మాణ సమయంలో చాలా మంది రైతులు భూములు కోల్పోయారు. . గ్రామంలో ఉన్న మత్స్యకారులు సైతం తమ భూములను త్యాగం చేయాల్సి వచ్చింది. దీంతో వారికి ఉపాధి కరువైంది. ఎంతో కాలంగా వ్యవసాయం చేస్తున్న జాలరి కుటుంబాలు.. చేపల వేటపై ఆధారపడ్డారు. జలాశయంలో సుమారు 10 టీఎంసీల నీరు ఉంటోంది. ఈ నీటిలోకి పుట్టితో వెళ్లి చేపలు పట్టటం ప్రమాదకరం. దీంతో.. జలాశయం నుంచి వెళ్లే ఎస్సార్బీసీ కాల్వలో చేపల వేట మొదలు పెట్టారు. అయినా చేపలు తప్పించుకుని పారిపోతుండటంతో సరికొత్త మార్గాన్ని అన్వేషించారు.
కాల్వలో ఒక్క చేప కూడా తప్పించుకోకుండా..3 లక్షల రూపాయలు వెచ్చించి భారీ వలను కొనుగోలు చేశారు. దీని వల్ల ప్రయోజనం చాలా ఉన్నా.. పెద్ద వలను లాగటం అంటే మాటలు విషయం కాదు. సుమారు 10 మంది జాలర్లు వలను తాడు సాయంతో లాగాల్సి ఉంటుంది. దీని కోసం చాలా కష్టపడాలి కూడా.. ప్రతి రోజూ ఎన్నోసార్లు ఇలా లాగటం వల్ల నీరసించిపోతున్నామని భావించిన మత్స్యకారులు.. ఓ ట్రాక్టర్ను కొనుగోలు చేశారు. తాడును ట్రాక్టర్కు కట్టేసి.. తేలిగ్గా లాగుతున్నారు. దీని వల్ల చాలా సులువుగా చేపలు పట్టగలుగుతున్నారు. ట్రాక్టర్ను 60 వేల రూపాయలకు కొనుగోలు చేసినట్లు మత్స్యకారులు చెబుతున్నారు. వినూత్న పద్ధతి ద్వారా ప్రతి రోజూ సుమారు వంద కేజీల వరకు చేపలు పడుతున్నారు. భారీ చేపలను సైతం చాలా సులువుగా పట్టుకుంటున్నారు.