Fake votes Registration in Nandyala: ఓటరు జాబితా రూపకల్పన ప్రక్రియ నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో తీవ్ర నిర్లక్ష్యంతో చేపట్టడం విస్మయానికి గురి చేస్తోంది. వివిధ ప్రాంతాలు, ఇంటి నంబర్ల ఆధారంగా ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేసే ముందు ఆయా వివరాలను సరిచూసుకుంటారు. ఇక్కడ మాత్రం అధికారులు తనిఖీలు చేసినట్లు కనిపించడం లేదు. నందికొట్కూరు పట్టణంలోని బైరెడ్డి రాజశేఖరరెడ్డి నగర్‌లో ఇంటి నంబరు 1-157-133 చిరునామా కింద 103 ఓట్లు ఉన్నట్లు చూపారు. వాస్తవానికి ఆ నంబరుతో అసలు ఇల్లే లేదు. దీన్ని బట్టి ఓటర్ల చేర్పులు, తొలగింపుల ప్రక్రియ ఎంత అడ్డగోలుగా జరిగిందో అర్థమవుతోంది.
నేటికీ కొనసాగుతున్న ఓట్లు..నందికొట్కూరు నియోజకవర్గంలోని.. 48 నంబరు పోలింగ్ కేంద్రం పరిధిలోఓటర్ల జాబితా తప్పులతడకగా ఉంది. బైరెడ్డి రాజశేఖర్రెడ్డినగర్‌లో.. ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారి ఓట్లను కొనసాగిస్తున్నారు. బీఎల్‌వోలు ఉద్దేశపూర్వకంగానే ఆయా ఓట్లను తొలగించకుండా వదిలేశారన్న ఆరోపణలు ఉన్నాయి. బైరెడ్డి రాజశేఖరరెడ్డి నగర్‌లో ఓ ప్రాంతంలో బుడగ జంగాల సామాజిక వర్గానికి చెందిన వారున్నారు. వారిలో పలువురు చాలా ఏళ్ల కిందటే గుంతకల్లు, గుత్తి, బళ్లారి, ఆత్మకూరు, నంద్యాల, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అయినప్పటికీ సుమారు 30మంది పేర్లు నేటికీ ఇక్కడ కొనసాగుతున్నాయి.