Water Problem in Nandyala: గత కొంతకాలంగా నంద్యాలలో తాగునీటి సమస్య నెలకొంది. పలుసార్లు విన్నవించినా ప్రజల దాహార్తిని తీర్చే నాధుడే లేడని స్వపక్ష, విపక్ష కౌన్సిలర్లు వాపోతున్నారు. తాగునీటి సమస్యను వెంటనే తీర్చాలంటూ.. పురపాలక సమావేశంలో సభ్యులు గొంతెత్తారు. అధికార పార్టీకి చెందిన వారితో పాటు విపక్ష సభ్యులూ సమస్య తీవ్రతను వివరించారు. తాగునీరు ఇవ్వాలంటూ ప్రజలు ఇంటి వద్దకు వస్తుంటే.. ఏడుపు వస్తుందని ఒకరు.. ఫోన్లు మీద ఫోన్లు చేస్తున్నారని మరొకరు వాపోయారు. సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి.. సభ్యులు చెప్పే సమస్యలు విని అవాక్కయ్యారు.
తాగునీటి సరఫరా పనుల్లో నిర్లక్ష్యం వహించారంటూ ఆరుగురిని సస్పెండ్ చేశారు. సమస్యపై దృష్టి సారించాలని.. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవన్నారు. తాగునీటి సమస్య పరిష్కరించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని.. నంద్యాల టీడీపీ ఇంఛార్జి భూమా బ్రహ్మానందరెడ్డి విమర్శించారు. తాగునీటి సరఫరాలో నిర్లక్ష్యం చేసిన ఓ రెగ్యులర్ ఉద్యోగితో పాటు అయిదు మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించారు. తాగునీటి సమస్య ఇపుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆందోళన చెందుతున్నారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేసి అందరికీ తాగునీరు అందిస్తామని మున్సిపల్ కమిషనర్ రవి చంద్రారెడ్డి అన్నారు.