Differences in Challa family: నంద్యాల జిల్లాలో చల్లా కుటుంబంలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. అవుకు జడ్పీటీసీ సభ్యురాలు చల్లా శ్రీలక్ష్మి, చల్లా రాజకీయ వారసుడు చల్లా విఘ్నేశ్వరరెడ్డి మధ్య ఏడాదిగా విభేదాలు కొనసాగుతున్నాయి. తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలు సేకరించి, అసత్య ప్రచారాలు చేస్తూ తమ ఉనికిని దెబ్బతీస్తున్నారంటూ అవుకు జడ్పీటీసీ సభ్యురాలు చల్లా శ్రీలక్ష్మి శనివారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరించారు. విషయం తెలుసుకున్న చల్లా అభిమానులు శ్రీలక్ష్మి వ్యవహారాన్ని తప్పుబట్టారు.
మాటలతో ప్రారంభమై దాడుల వరకు..చల్లా శ్రీలక్ష్న్మి, విఘ్నేశ్వరరెడ్డి అభిమానుల మధ్య మాటల యుద్ధం ప్రారంభమై దాడుల వరకూ వెళ్లింది. ఇరువర్గాలకు చెందిన వ్యక్తులు పెద్ద సంఖ్యలో గుమిగూడటంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. సకాలంలో పోలీసులు చొరవ తీసుకొని గుంపులను చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోనికి వచ్చింది. అవుకు జడ్పీటీసీ సభ్యురాలు చల్లా శ్రీ లక్ష్మి, ఆమె అనుచరులు విక్రాంత్‌రెడ్డి, సాయితేజరెడ్డి, చరణ్‌రెడ్డి,.. మరోవర్గం తరఫున చల్లా రాజశేఖర్‌రెడ్డి, డి.రవీంద్రనాథ్‌రెడ్డిలకు బనగానపల్లి సీఐ తిమ్మారెడ్డి ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఇరువర్గాలకు చెందిన ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అవమానపరుస్తున్నారు.. తమ ఉనికిని జీర్ణించుకోలేని వ్యక్తులు తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కాల్‌డేటా సేకరించి అవమానకరంగా ప్రచారం చేస్తున్నారని చల్లా శ్రీలక్ష్మి ఆరోపించారు. తాము ప్రజలకు సేవ చేయాలనుకుంటే.. చల్లా కుమారుడు విఘ్నేశ్వర్‌రెడ్డి, చల్లా సోదరులు అడుగడుగునా అడ్డుకుంటూ అవమానపరుస్తున్నారని అన్నారు. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఆంక్షలు విధిస్తున్నారని అన్నారు.