Constable murder case ఆయన ఓ పోలీసు కానిస్టేబుల్.. రౌడీషీటర్ల చేతిలో హత్యకు గురై పదిరోజులైంది. అయినా ఇప్పటివరకూ నిందితుల్లో ఒక్కరినీ పోలీసులు పట్టుకోలేకపోయారు. ప్రత్యేక దర్యాప్తు బృందాల్ని ఏర్పాటుచేశామని, నిందితుల కోసం గాలిస్తున్నామనే ప్రకటనలే తప్ప.. వారిని అదుపులోకి తీసుకోలేకపోయారు. హత్య జరిగి ఇన్ని రోజులవుతున్నా నిందితులు ఎక్కడున్నారో గుర్తించలేకపోవటం పోలీసుల వైఫల్యమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కానిస్టేబుల్ హత్య కేసే ఇలా ఉంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటంటున్నారు. అసాంఘిక శక్తులు, రౌడీషీటర్లపై నిఘాలేమి, వారి చర్యల పట్ల ఉదాసీనత, గస్తీ కొరవడటం, శాంతిభద్రతల్ని పట్టించుకోని ఫలితమే తాజాగా నంద్యాలలో కానిస్టేబుల్ సురేంద్రకుమార్ హత్యకు దారితీసింది. జిల్లాకేంద్రంలోనే ఇంతటి దారుణ పరిస్థితి ఉంటే.. ఇక గ్రామాల్లో ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు.
పారిపోయేంత సమయమిచ్చి...
నంద్యాల డీఎస్పీ కార్యాలయంలో క్లర్కుగా పనిచేసే కానిస్టేబుల్ సురేంద్రకుమార్ (35)ను ఆరుగురు హత్య చేసినట్లు ప్రత్యక్షసాక్షి పోలీసులకు తెలిపారు. వారిలో ముగ్గురు రౌడీషీటర్లు ఉన్నట్లు సమాచారం. ఈ నెల 7వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో టెక్కె మార్కెట్ సమీపంలోని టాటూ దుకాణం వద్ద నుంచి పద్మావతి సర్కిల్ వరకూ కానిస్టేబుల్‌ను వెంటాడినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయింది.
*పద్మావతి కూడలి వద్ద ఓ ఆటోడ్రైవర్ మెడపై కత్తి పెట్టిన రౌడీషీటర్లు... సురేంద్రకుమార్‌ను అందులోకి ఎక్కించి సమీపంలోని చెరువుకట్ట వద్దకు తీసుకెళ్లి అక్కడే కత్తులతో పొడిచి చంపారు. నిందితుల్లో ముగ్గురు ఘటనాస్థలం నుంచే పారిపోగా.. మరో ముగ్గురు అదే ఆటోలో శ్రీనివాస సెంటర్‌లో దిగారు. ఇద్దరు యువకుల్ని చితకబాది వారి ద్విచక్ర వాహనాల్లో పారిపోయారు. వారిలో ఒక రౌడీషీటర్ అక్కడినుంచి ఇంటికి వెళ్లి భార్యను కూడా తనతో తీసుకెళ్లాడు.
*ఈ ఘటనలన్నీ రాత్రి 9-11 గంటల మధ్యే జరిగాయి. పోలీసులు అప్రమత్తంగా ఉంటే.. ఎక్కడికక్కడ తనిఖీలు చేసి నిందితుల్ని వెంటనే పట్టుకునేవారు. కానీ ఆ పరిస్థితే లేకపోవటంతో పారిపోవటానికి వాళ్లకు వీలుచిక్కింది. వెంటనే అప్రమత్తం కాని పోలీసులు.. ఇప్పుడు వారికోసం గాలిస్తున్నామంటున్నారు.
పోలీసింగ్ ఉంటే.. హత్యే జరిగేది కాదు కదా!