ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నా వెంట్రుక కూడా పీకలేరు : జగన్ - ప్రతిపక్షాలతో పాటు మీడియాపై జగన్​ ఫైర్​

Cm Jagan Fires : "దేవుడి దయ, ప్రజల దీవెనలు ఉన్నంతకాలం.. విపక్షాలు, మీడియా నా వెంట్రుక కూడా పీకలేరు" అని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. తాము సంక్షేమం కోసం పాటుపడుతుంటే.. ప్రతిపక్షాలు, మీడియా దుష్ప్రచారం చేస్తున్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నంద్యాలలో జగనన్న వసతిదీవెన రెండో విడత నిధుల విడుదల కార్యక్రమంలో జగన్ మాట్లాడారు.

Cm Jagan
ముఖ్యమంత్రి జగన్

By

Published : Apr 8, 2022, 3:23 PM IST

Updated : Apr 9, 2022, 5:18 AM IST

నాపై చంద్రబాబు బురద : జగన్

CM Jagan at Nandyal: విద్యుత్‌ కోతలు, కోర్టుల్లో వ్యతిరేక తీర్పులు, ముదురుతున్న ఆర్థిక సంక్షోభం, కల్తీ సారా మరణాలు, వివేకా హత్యపై సీబీఐ విచారణలో వెలుగుచూస్తున్న అంశాలు, దూరమవుతున్న కుటుంబసభ్యులు, మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ సమస్యలతో సతమతమవుతున్న ముఖ్యమంత్రి తీవ్రమైన నిరాశా నిస్పృహలతో సహనం కోల్పోతున్నారు. ఈ విషయం శుక్రవారం నంద్యాల బహిరంగ సభలో స్పష్టమైంది. జగనన్న వసతి దీవెన పథకం నిధులు జమ చేసే కార్యక్రమం కోసం శుక్రవారం నంద్యాల వచ్చిన సీఎం జగన్‌ స్థానిక ఎస్పీజీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రతిపక్షాలు, మీడియాపై తీవ్ర అసహనంతో, ఆగ్రహంతో ఊగిపోయారు.

రాష్ట్రంలో మంచి మార్పులతో పాలన జరుగుతున్నా చంద్రబాబు, ఆయన పార్టీ, ఆయన దత్తపుత్రుడు, ఆయనను సమర్థించే మీడియాకు ఇవేవీ కనిపించవు. రోజుకో కట్టుకథ, రోజుకో వక్రీకరణ, రోజుకో విధంగా ప్రభుత్వంపై బురదచల్లే కార్యక్రమం చేస్తున్నారు. ఈ అబద్ధాలు సరిపోవని పార్లమెంట్‌ను వేదికగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయడానికి బురద జల్లుతూ ప్రభుత్వ పరువు తీస్తున్న గొప్ప చరిత్ర వీళ్లది. పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, ఒడిశా ఇలా ఎక్కడైనా ప్రతిపక్షాలు ఉంటాయి. కానీ రాష్ట్ర పరువును కాపాడే విషయంలో అవన్నీ ఏకమవుతాయి. ముఖ్యంగా పార్లమెంట్‌లో రాష్ట్రం గురించి చెప్పేటప్పుడు గొప్పగా రాష్ట్ర ప్రతిష్ఠను పెంచాలని ఆరాటపడతారు. ఇక్కడ దౌర్భాగ్య ప్రతిపక్షం, దౌర్భాగ్య దత్తపుత్రుడు, దౌర్భాగ్య మీడియా ఇవీ మన రాష్ట్రం చేసుకొన్న కర్మలు. మన రాష్ట్ర పరువును తాకట్టు పెడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీ అందరికీ ఒకటే తెలియజేస్తున్నా.. ఇన్ని సమస్యలు, కష్టాలు ఇవేవీ నన్ను కదిలించలేవు, నన్ను బెదిరించలేవు. దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతో ఉన్నంతకాలం వాళ్లు నా వెంట్రుక కూడా పీకలేరు’ - నంద్యాల సభలో సీఎం జగన్‌

ఏదో ఒకరోజు గుండెపోటుతో టికెట్టు కొంటారు..:‘పిల్లలకు మంచి జరగాలని, భోజనం తర్వాత ‘చిక్కీ’ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఆ చిక్కీ పాకం పిల్లల చేతికంటి, వాళ్లు మళ్లీ ఆ చేతిని నోట్లో పెట్టుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదేమోనని, ఆ చిక్కీకి మంచి కవర్‌ తొడిగి జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పిల్లలకు పోషకాహారం ఇచ్చేందుకు చంద్రబాబు హయాంలో ఖర్చు చేసింది కేవలం రూ.500 కోట్లు. ప్రస్తుత జగనన్న గోరుముద్దకు రూ.1900 కోట్లు ఖర్చు చేస్తున్నాం. అవన్నీ వదిలేసి కేవలం చిక్కీ కవర్‌పై జగనన్న చిత్రం ఉందని మాత్రం వీళ్లందరూ రాస్తారు. ఈ అసూయ, కడుపు మంటకు మందే లేదు. అవి ఇంకా ఎక్కువైతే కచ్చితంగా వీళ్లందరికీ బీపీ వస్తుంది. కచ్చితంగా ఏదో ఒకరోజు గుండెపోటు వచ్చి టికెట్‌ కొంటారు. కాబట్టి అసూయను ఇప్పటికైనా తగ్గించుకోకపోతే ఆరోగ్యానికి చేటని ప్రతిపక్షానికి సలహా ఇస్తున్నా’ అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఒక కుటుంబంలో ఒకరికే పథకం పరిమితం కాదు..:‘పేదరికంతో విద్యార్థులు ప్రాథమిక విద్య, ఉన్నత విద్యకు దూరమవకూడదు. బిడ్డల్ని చదివించడానికి ఏ తల్లిదండ్రీ అప్పులపాలవకూడదు. నా పాదయాత్రలో ఇలాంటి గాథలెన్నో విన్నా. అందుకే విద్యారంగంలో సంస్కరణలు తెచ్చి, సమూల మార్పులు చేశాం’ అని జగన్‌ అన్నారు.ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా చేసి, పరిపాలనను ప్రజలకు మరింత చేరువలోకి తెస్తానని తొలిసారి నంద్యాలలోనే మాటిచ్చానన్నారు. దాన్ని నిలబెట్టుకొన్న తర్వాత తొలిగా నంద్యాలకే వచ్చానని చెప్పారు. ‘గతంలో వైఎస్సార్‌ హయాంలో పూర్తి ఫీజు రీయంబర్స్‌మెంట్‌ చూశాం. తర్వాత అందరూ ఆ పథకాన్ని నీరుగార్చారు. పేద పిల్లల చదువుల కోసం నాన్న ఒక అడుగు వేస్తే, నేను రెండడుగులు వేశాను. అందులో భాగంగానే ఫీజు రీఎంబర్స్‌మెంట్‌కు పూర్వ వైభవం తీసుకువచ్చాం. జగనన్న వసతి దీవెన పథకం 2021-22 సంవత్సరానికి సంబంధించి రెండో విడత నగదును రాష్ట్రంలోని 10,68,150 మంది విద్యార్థులకు మేలు చేసేలా, 9,61,140 మంది తల్లుల ఖాతాల్లోకి రూ.1024 కోట్లు నేరుగా జమ చేశాం. ఒక కుటుంబంలో ఒకరికే పథకం పరిమితం చేయడం లేదు. ఇంట్లో ఎంత మంది ఉంటే అందరినీ చదివించండి. మీ అన్నగా మీకు తోడుగా ఉంటానని హామీ ఇస్తున్నాను. నాడు- నేడు’తో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేశాం. తొలిసారిగా ద్విభాషా పాఠ్యపుస్తకాలు తీసుకొచ్చాం. పూర్తిగా ఆంగ్ల మాధ్యమం వైపు అడుగులు వేశాం’ అని సీఎం తెలిపారు.

గత ప్రభుత్వ బకాయిలూ చెల్లించాం..:‘2017-18, 2018-19 సంవత్సరాలకు సంబంధించిన ఫీజు బకాయిలు రూ.1,778 కోట్లను చంద్రబాబు వదిలేస్తే వాటిని కూడా కలిపి జగనన్న విద్యాదీవెన కింద రూ.6,969 కోట్లు ఇచ్చాం. జగనన్న వసతి దీవెన పథకంలో ఇప్పటి వరకు రూ.3,329 కోట్లు అందజేశాం. ఇదంతా పిల్లల కోసం వాళ్ల మేనమామగా నేను చేసిన ఖర్చు అని అక్కచెల్లెళ్లందరికీ చెబుతున్నా’ అని సీఎం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో విద్యారంగంలో డ్రాప్‌అవుట్లు గణనీయంగా తగ్గాయని ముఖ్యమంత్రి అన్నారు. ఇంటర్మీడియట్‌ తర్వాత కళాశాలల్లో చేరుతున్న వారి సంఖ్యకు సంబంధించి జీఈఆర్‌ (గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో) తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి 32.4 శాతం ఉంటే, ఏడాదిలో 35.2 శాతానికి చేరిందని చెప్పారు. ఆడపిల్లలకు సంబంధించి జీఈఆర్‌ జాతీయస్థాయిలో కేవలం 2.28 శాతం పెరిగితే, రాష్ట్రంలో 11.03 శాతం వృద్ధి నమోదవడం హర్షణీయమని చెప్పారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి నుంచే నంద్యాలలో సీపీఎం, సీపీఐ, వ్యవసాయ, విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు.

ఇంతకు ముందూ నంద్యాలలోనే..:గతంలో ఉపఎన్నికల సమయంలో నంద్యాలలోనే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై నాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2017 ఆగస్టు 3న ఇదే ఎస్పీజీ మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ ‘చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చినా పర్వాలేదు’ అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీనిపై అప్పట్లో ఆయన ఎన్నికల సంఘానికి వివరణ కూడా ఇవ్వాల్సి వచ్చింది. తర్వాత 8రోజులకే ఆగస్టు 11న మరోసారి రోడ్‌షోలో మాట్లాడుతూ ‘చంద్రబాబుకు కళ్లు నెత్తికెక్కాయి.. ఉరిశిక్ష వేసినా తప్పు లేదు’ అని జగన్‌ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపాయి.

ఇదీ చదవండి:Jagananna Vasathi Deevena: విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం: సీఎం జగన్

Last Updated : Apr 9, 2022, 5:18 AM IST

ABOUT THE AUTHOR

...view details