CM Jagan on Nandyal Development: ఇదీ గతేడాది ఏప్రిల్ 7న బహిరంగ సభలో.. నంద్యాల నియోజకవర్గంపై సీఎం జగన్ కురిపించిన హామీల వర్షం. కానీ వీటిలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. నియోజకవర్గంలో అభివృద్ధి ముందుకు సాగక పోగా.. మౌలిక వసతులూ కరవై ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నంద్యాలకు ఔటర్ రింగ్ రోడ్డును మంజూరు చేస్తున్నట్లు ప్రకటించినా.. ఒక్క అడుగూ ముందుకు పడలేదు. ఈ రోడ్డుకు 100 కోట్ల రూపాయలతో రోడ్లు, భవనాల శాఖ పంపిన ప్రతిపాదన ప్రభుత్వం వద్దే ఇంకా పెండింగ్‌లో ఉంది.
పేదలకు ఉచితంగా ఇళ్లను కట్టించి రిజిస్టర్ చేసిస్తామని ఎన్నో సార్లు సీఎం జగన్ హామీ ఇచ్చారు. కొందరికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం మినహా..ఇళ్ల నిర్మాణంపై దృష్టి నిలపలేదు. టీడీపీ హయాంలో ఎస్సార్బీసీ కాలనీలో 50 ఎకరాల్లో 890 కోట్ల రూపాయలతో టిడ్కో గృహాలు నిర్మించారు. అలాగే వైఎస్సార్ నగర్, అయ్యలూరు మెట్ట వద్ద పేదలకు అపార్టుమెంట్ల నిర్మాణాన్ని అప్పటి ప్రభుత్వం చేపట్టింది. కానీ లబ్ధిదారులకు వైసీపీ ప్రభుత్వం వాటినీ ఇప్పటికీ అప్పగించలేదు.
నంద్యాలలో పలు ప్రాంతాలు కొద్దిపాటి వర్షానికే నీట మునుగుతాయి. పట్టణ నడిబొడ్డున ఉన్న పద్మావతినగర్ మురుగునీటి చెరువుగా మారుతోంది. పాత పట్టణంలో మద్దిలేరు వాగు విస్తరణ, కరకట్టల నిర్మాణం ఊసే లేదు. తరచూ ఈ ప్రాంతం ముంపునకు గురవుతోంది. నంద్యాల చిన్న చెరువును ట్యాంక్ బండ్లా అభివృద్ధి చేస్తామని, పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని చెప్పినా ఆ దిశగా చర్యలు లేవు. పట్టణంలో మురుగునీటి కాలువల నిర్మాణాన్నీ చేపట్టలేదు. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ప్రతిపాదన గురించి పట్టించుకునే వారు కరవయ్యారు.