Arrests in NandyalaKidnap Case: జూన్ 5.. కారులో వెళ్తున్న తండ్రీ, కుమారుడితో పాటు డ్రైవర్ను సైతం కిడ్నాప్చేసిన అగంతకులు.. రూ.4కోట్లు డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యుల ప్రాణాలే ముఖ్యమనుకుని అడిగిన మొత్తం చెల్లించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూడగా.. రంగంలోకి దిగిన పోలీసులు.. 25రోజుల వ్యవధిలో నిందితుల్లో 12మందిని పట్టుకుని రూ.40లక్షలు మాత్రమే రికవరీ చేశారు. దర్యాప్తు కొనసాగిస్తున్న క్రమంలో ఇవాళ మరో ముగ్గురు ముఖ్య నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 2.66కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా కిడ్నాప్ ఉదంతంపై దర్యాప్తు గుట్టుగా సాగుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
Kidnap on June 5th: నంద్యాల జిల్లా బేతంచర్ల మండలం సీతారామపురం వద్ద జూన్ అయిదో తేదీన బనగానపల్లెకు చెందిన వినాయక రెడ్డి, భరత్ కుమార్ రెడ్డి అనే తండ్రీ కొడుకుల కిడ్నాప్ కేసులో ఇవాళ మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.2.66 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇదివరకే ఈ కేసులో 12 మంది నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.. వారి వద్ద నుంచి నలభై లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఇంతవరకు ఈ కిడ్నాప్ కేసు (Kidnapping Case)లో మొత్తం 15 మంది నిందితులను అరెస్టు చేసి.. మూడు కోట్ల రూపాయలను రికవరీ చేశారు. నంద్యాల జిల్లా బనగానపల్లెకు చెందిన కంకర వ్యాపారి వినాయక రెడ్డి, ఆయన కుమారుడు భరత్ కుమార్ రెడ్డిలతో పాటు డ్రైవర్ సాయినాథ రెడ్డిని జూన్ 5వ తేదీనకిడ్నాప్ చేసిన ముఠా... నాలుగు కోట్ల రూపాయలు డిమాండ్ చేసింది.