Food Poisoning In Gurukula School: గురుకుల పాఠశాలల్లోని విద్యార్థినులు తరచూ అస్వస్థతకు గురవుతున్నారు. అక్కడ ఉన్న పరిస్థితులు, వాతావరణం, కలుషిత ఆహారం, పరిసరాల్లో మురుగు నీరు నిల్వ ఉండడం తదితర కారణాలతో విద్యార్థినిలు అస్వస్థతకు లోనవుతున్నారు. రాష్ట్రంలో ఉన్న కొన్ని గురుకుల పాఠశాలలో ఇదే పరిస్థితి. గత నెలలో శ్రీకాకుళం జిల్లా పలాసలోని జ్యోతిబా ఫులే గురుకుల పాఠశాల బాలికలు అస్వస్థతకు గురైయ్యారు. అక్కడ వారు మురుగు నీరు కారణంతో అస్వస్థతకు గురయ్యారని తెలిసింది. తాజాగా నంద్యాల జిల్లాలో 42 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.
మొదట 12 మందికి అస్వస్థత: నంద్యాల జిల్లా పాణ్యం మండలం నెరవాడ గ్రామంలోని ఏపీ గిరిజన గురుకుల బాలికల పాఠశాలకు చెందిన 42 మంది విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. కలుషిత ఆహారమే అస్వస్థతకు కారణంగా ప్రాథమికంగా ధ్రువీకరించారు. గురువారం సాయంత్రం అల్పాహారంలో భాగంగా బొరుగులు తిన్నట్లు బాలికలు తెలిపారు. కడుపు నొప్పితో బాధపడుతున్న12 మంది బాలికలను చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న క్రమంలో వైద్యులు చికిత్స చేసిన తర్వాత బాలికలు కోలుకున్నారు.
భరించలేని కడుపు నొప్పి.. విద్యార్థినుల రోదన :అనంతరం మరో 30 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. వారిని కూడా ఆస్పత్రికి తరలించారు. వారికి పరీక్షలు నిర్వహించి చికిత్స చేశారు. కడుపు నొప్పి భరించలేక విద్యార్థినులు రోదిస్తూ ఇబ్బంది పడ్డారు. అధికారులకు సమాచారం అందడంతో ఆసుపత్రి చేరుకున్నారు. పరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అదే రోజు అందజేసిన ఐరన్ మాత్రలను పిల్లలు వేసుకున్నారు. అస్వస్థతకు గురైన వారిలో ఏడు, ఎనిమిది, తొమ్మిది, తరగతులకు చెందిన బాలికలు ఉన్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు తెలిపారు.