కర్నూలు జిల్లా గూడూరు నగర పంచాయతీలు డ్వాక్రా మహిళలు ప్రభుత్వ పథకాల పంపిణీపై అసంతృప్తి వ్యక్తంచేశారు. నిత్యావసరాల ధరలు పెంచి.. పథకాల చెక్కులు పంపిణీ చేయడం ఏంటని తిరగబడ్డారు. గూడూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సున్నా వడ్డీ మూడో విడత చెక్కు పంపిణీ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ జరదొడ్డి సుధాకర్‌కు చుక్కెదురైంది. 'నూనె ధర, గ్యాస్ ధర ఆకాశాన్నంటాయి. ప్రభుత్వం సరఫరా చేసే బియ్యం కూడా సరిగా లేవు. ప్రజల కష్టాలను పట్టించుకోకుండా.. ప్రభుత్వ పథకాలు ఎందుకు. ఈ పథకాలతో లాభాలు ఏం లేవు. ప్రజలకు కనీసం ఇల్లు కట్టించి ఇవ్వాలి. నగర పంచాయతీలో తాగడానికి కనీసం నీటిని సక్రమంగా ఇవ్వడం లేదు. ఇష్టమొచ్చినట్లు పన్నుల భారం ప్రజలపై విధిస్తూ.. ఇబ్బందులకు గురి చేస్తున్నారు' అని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
సభకు భారీ ఎత్తున మహిళలు హాజరుకావడం, ఎమ్మెల్యే మాట్లాడే సమయంలోనే మహిళలంతా తిరుగుబాటు చేయడంతో ఎమ్మెల్యే సభను మధ్యలోనే ఆపి వేయాల్సి వచ్చింది. హుటాహుటిన సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, చెక్కులు పంపిణీ చేశారు. సభ రసాభాస కావడంతో పోలీసులు.. మహిళలను అదుపుచేసే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా డ్వాక్రా బుక్ కీపర్లు సైతం మహిళలను అడ్డుకున్నారు. సభను మధ్యలో నిలిపివేసి తిరిగి వెళ్తున్న ఎమ్మెల్యే సుధాకర్‌ను మహిళలు అడ్డుకున్నారు. తమ సమస్యలు పరిష్కరించడం లేదని.. మహిళలకు న్యాయం చేయడం అంటే నిత్యావసరాలు పెంచడం కాదన్నారు. పేదవాడికి కనీస గూడు, తాగునీటి సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యే నిలదీశారు.